Bendakaya Vepudu Tips: బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడి పొడిగా రావాలా? ఈ చిట్కాలు పాటించండి!

Bendakaya Vepudu Tips: బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా రావాలంటే ఈ సులభమైన వంటింటి చిట్కాలు పాటించండి. రుచికరంగా తయారు చేసుకోండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Nov 2026 2:07 AM IST
Bendakaya Vepudu Tips
X

Bendakaya Vepudu Tips: బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడి పొడిగా రావాలా? ఈ చిట్కాలు పాటించండి!

Bendakaya Vepudu Tips: బెండకాయ వేపుడు అంటే చాలామందికి ఇష్టమే. అయితే బెండకాయలో సహజంగా ఉండే జిగురు కారణంగా వేపుడు కొన్నిసార్లు ముద్దగా మారిపోతుంది. ఎంత ప్రయత్నించినా హోటల్‌ స్టైల్‌లో పొడిపొడిగా రావడం లేదని చాలామంది భావిస్తుంటారు. కానీ కొన్ని సింపుల్‌ వంటింటి చిట్కాలు పాటిస్తే జిగురు లేకుండా, మంచి రుచితో కరకరలాడే బెండకాయ వేపుడును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

బెండకాయలను ఇలా సిద్ధం చేసుకోండి

ముందుగా అర కిలో తాజా బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడగాలి. కడిగిన వెంటనే కోయకుండా జల్లెడలో వేసి సుమారు 10 నిమిషాల పాటు ఉంచాలి. బెండకాయలపై ఉన్న నీరు పూర్తిగా ఆరిపోయిన తర్వాతే ముక్కలుగా కోయాలి. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటే వేపుడు జిగురుగా మారే అవకాశం ఉంటుంది.

బెండకాయలను మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా మధ్యస్థ పరిమాణంలో కోసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు సమానంగా వేగుతాయి.

పోపు వేసి బెండకాయ ముక్కలను వేయించండి

ముందుగా మందపాటి బాణలిని స్టవ్‌పై పెట్టి రెండు నుంచి మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక మధ్యస్థ ఉల్లిపాయను వేసి కొద్దిసేపు వేయించాలి.

ఆ తర్వాత బెండకాయ ముక్కలను బాణలిలో వేసి మీడియం మంటపై వేయించాలి. ఈ సమయంలో తరచూ కలపకుండా, మధ్యమధ్యలో మాత్రమే నెమ్మదిగా కలపాలి. ఎక్కువగా కలిపితే ముక్కలు విరిగిపోవడంతో పాటు జిగురు బయటకు వచ్చి వేపుడు ముద్దగా మారే అవకాశం ఉంటుంది.

జిగురు తగ్గిన తర్వాతే ఉప్పు వేయాలి

బెండకాయ వేపుడు పొడిపొడిగా రావడానికి ముఖ్యమైన చిట్కా ఉప్పు వేసే సమయం. బెండకాయ ముక్కలు వేసిన వెంటనే ఉప్పు వేయకూడదు. ముందుగా సుమారు ఐదు నిమిషాల పాటు వేయించి జిగురు తగ్గిన తర్వాతే ఉప్పు కలపాలి.

ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ పసుపు వేసి మంటను సిమ్‌లో పెట్టాలి. ముక్కలు బాగా వేగే వరకు మధ్యమధ్యలో నెమ్మదిగా కలుపుతూ ఉంచాలి. గరిటెతో ముక్కలను కింద నుంచి పైకి తిప్పుతూ కలిపితే అవి చిదరకుండా ఉంటాయి.

వెల్లుల్లి, కారం కలిపితే అదిరిపోయే రుచి

బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి అందులో కలపాలి. వెల్లుల్లిని ఈ దశలో వేయడం వల్ల దాని రుచి, సువాసన వేపుడుకు బాగా పట్టుకుంటాయి.

చివరగా ఒకటిన్నర టీస్పూన్ కారం లేదా మీ రుచికి తగినంత వేసి బాగా కలపాలి. బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు చక్కగా వేగి పొడిపొడిగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

చిన్న చిట్కాలు గుర్తుంచుకోండి: బెండకాయలను కడిగిన వెంటనే కోయకూడదు. ఉప్పును ముందుగానే వేయకూడదు. ఎక్కువగా కలపకూడదు. వీలైనంత వరకు మందపాటి బాణలిని ఉపయోగించాలి. ఈ పద్ధతులు పాటిస్తే జిగురు తగ్గి రుచికరమైన బెండకాయ వేపుడు తయారవుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్