Bisleri: మా నీరు పూర్తిగా సురక్షితం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆరోపణలపై స్పందించిన బిస్లరీ
Bisleri: పరిమితికి మించి బ్రోమేట్ స్థాయిలు ఉన్నాయన్న FSSAI నివేదికపై బిస్లరీ స్పందించింది. తమ తాగునీరు పూర్తిగా సురక్షితమని, కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తామని సంస్థ వివరణ ఇచ్చింది.
Bisleri: మా నీరు పూర్తిగా సురక్షితం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆరోపణలపై స్పందించిన బిస్లరీ
Bisleri: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ 'బిస్లరీ' (Bisleri) నీరు తాగడానికి సురక్షితం కాదంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) వెల్లడించిన నేపథ్యంలో ఆ సంస్థ తాజాగా స్పందించింది. తమ తాగునీరు అత్యంత సురక్షితమైనదని, వినియోగదారుల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని బిస్లరీ స్పష్టం చేసింది.
తాగునీటి భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని బిస్లరీ తన ప్రకటనలో పేర్కొంది. ఉత్పత్తి ప్రక్రియలో అత్యున్నతమైన, కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామని వెల్లడించింది. అలాగే, ఈ అంశంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చేపట్టే ఎలాంటి విచారణకైనా తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.
అసలేం జరిగింది?
ఇటీవల బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షల్లో నీటిలో ఉండాల్సిన నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ స్థాయిలో 'బ్రోమేట్' అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నివేదిక బయటకు రావడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే బిస్లరీ యాజమాన్యం వివరణ ఇస్తూ తమ నీటి నాణ్యతపై భరోసా కల్పించే ప్రయత్నం చేసింది.




