Boiled vs Half-Boiled Eggs: ఉడికించిన గుడ్డా? హాఫ్ బాయిల్డ్ ఎగ్గా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

రోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.

CR Reddy
Published on: 28 Nov 2026 9:15 AM IST
Boiled vs Half-Boiled Eggs: ఉడికించిన గుడ్డా? హాఫ్ బాయిల్డ్ ఎగ్గా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
X

Boiled vs Half-Boiled Eggs: రోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అందుకే చాలామంది ఉదయం అల్పాహారంలో ఉడికించిన గుడ్డు తింటుంటారు. మరికొందరు తెల్లసొన ఉడికి, పచ్చసొన మెత్తగా ఉండే హాఫ్ బాయిల్డ్ ఎగ్‌ను ఇష్టపడతారు. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? పోషకాల పరంగా ఏదైనా తేడా ఉందా? ప్రముఖ డైటీషియన్ గీతికా చోప్రా చెప్పిన వివరాల ప్రకారం.. పూర్తిగా ఉడికించిన గుడ్డు, హాఫ్ బాయిల్డ్ గుడ్డు మధ్య పోషక విలువల్లో పెద్దగా తేడా ఉండదు. కానీ ఆహార భద్రత విషయంలో మాత్రం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.

పూర్తిగా ఉడికించిన గుడ్డుతో ఎలాంటి ప్రయోజనాలు?

గుడ్డులో మంచి నాణ్యత కలిగిన ప్రోటీన్‌తో పాటు విటమిన్ బి12, విటమిన్ డి, కోలిన్, సెలీనియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. గుడ్డును పూర్తిగా ఉడికించినప్పుడు తెల్లసొన, పచ్చసొన రెండూ బాగా ఉడుకుతాయి. దీంతో సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పూర్తిగా ఉడికించిన గుడ్డు తినడం మంచిది. ఆహార భద్రత పరంగా కూడా ఇదే మెరుగైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.

హాఫ్ బాయిల్డ్ గుడ్డు తింటే ప్రమాదం ఉందా?

హాఫ్ బాయిల్డ్ గుడ్డులో తెల్లసొన మాత్రమే ఉడికి, పచ్చసొన లోపల మెత్తగా లేదా దాదాపు పచ్చిగానే ఉంటుంది. పోషకాల పరంగా పూర్తిగా ఉడికించిన గుడ్డుతో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఉండదు. అయితే గుడ్డు తగినంత ఉడకకపోతే సాల్మొనెల్లా బ్యాక్టీరియా మిగిలి ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. పాశ్చరైజ్ చేసిన గుడ్లను ఉపయోగిస్తే ఈ ముప్పు తగ్గుతుంది. అయినప్పటికీ చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు సగం ఉడికిన గుడ్లకు దూరంగా ఉండటం మంచిది.

పచ్చసొన తినాలా? తెల్లసొన మాత్రమే సరిపోతుందా?

గుడ్డులోని తెల్లసొనలో ప్రధానంగా ప్రోటీన్ ఉంటుంది. అందుకే కండరాల పెరుగుదల, శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందించడం కోసం చాలామంది తెల్లసొనను ఎక్కువగా తీసుకుంటారు. అయితే పచ్చసొనలోనూ ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ డి, విటమిన్ బి12, కోలిన్, ఐరన్, కొవ్వులో కరిగే విటమిన్లు లభిస్తాయి. అందువల్ల ఎలాంటి ప్రత్యేక ఆరోగ్య సమస్యలు లేని వారు గుడ్డులోని తెల్లసొనతో పాటు పచ్చసొన కూడా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వైద్యులు ప్రత్యేకంగా ఆహార నియంత్రణ సూచించినవారు మాత్రం తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా గుడ్డు తీసుకోవాలి.

రోజూ గుడ్డు తినేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి

రోజువారీ ఆహారంలో గుడ్డును చేర్చుకోవాలనుకునేవారు పూర్తిగా ఉడికించిన గుడ్డుకు ప్రాధాన్యం ఇవ్వాలని డైటీషియన్ సూచిస్తున్నారు. గుడ్డును తగినంత ఉడికించి తెల్లసొన, పచ్చసొన రెండూ గట్టిపడేలా చూసుకోవాలి. గుడ్డుతో పాటు ఆవిరిపై ఉడికించిన కూరగాయలు, గోధుమ రొట్టె లేదా ఇతర తృణధాన్యాలు తీసుకుంటే మంచి అల్పాహారం అవుతుంది. గుడ్డు కొనేటప్పుడు పగుళ్లు ఉన్నాయో లేదో పరిశీలించాలి. నిల్వ చేసే విధానంలోనూ పరిశుభ్రత పాటించాలి. మొత్తంగా చూస్తే హాఫ్ బాయిల్డ్, పూర్తిగా ఉడికించిన గుడ్లలో పోషకాల తేడా పెద్దగా లేకపోయినా.. బ్యాక్టీరియా ముప్పును తగ్గించుకునేందుకు పూర్తిగా ఉడికించిన గుడ్డే సురక్షితమైన ఎంపిక.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.