Health: క్యాన్సర్‌ను జయించడం సాధ్యమేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే
Health: క్యాన్సర్ పేరు ఆందోళన మొదలవుతుంది. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే సందేహాలు కలుగుతాయి.
Health: క్యాన్సర్‌ను జయించడం సాధ్యమేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే
Health: క్యాన్సర్ పేరు ఆందోళన మొదలవుతుంది. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే సందేహాలు కలుగుతాయి. అయితే క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో సరైన చికిత్స, పోషకాహారం, శారీరక శ్రమతో పాటు మానసిక ధైర్యం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా చికిత్స సమయంలో ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చు.
క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే నిపుణుల సలహా తీసుకోండి
క్యాన్సర్ చికిత్సలో మొదటి అడుగు సరైన వైద్యుడిని సంప్రదించడం. వ్యాధిని గుర్తించిన తర్వాత క్యాన్సర్ ఏ రకానికి చెందినది? ఏ దశలో ఉంది? అనే విషయాలను బట్టి వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. కొందరికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మరికొందరికి కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యునోథెరపీ లేదా వీటిలో ఒకటి కంటే ఎక్కువ చికిత్సలు అవసరమవుతాయి.
ప్రతి రోగికి ఒకే రకమైన చికిత్స పనిచేయదు. అందుకే ఇతరులకు సూచించిన మందులను వాడటం, సొంతంగా చికిత్స మార్చుకోవడం, ఇంటి చిట్కాలపైనే ఆధారపడటం వంటివి చేయకూడదు. వైద్యులు సూచించిన మందులను సమయానికి తీసుకోవాలి. చికిత్స మధ్యలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే వైద్యులకు తెలియజేయాలి. సరైన సమయంలో చికిత్స ప్రారంభించడం, సూచనలను పాటించడం వ్యాధిని ఎదుర్కోవడంలో కీలకం.
పోషకాహారంతో శరీరానికి బలాన్ని అందించండి
క్యాన్సర్ చికిత్స సమయంలో శరీరం బలహీనపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కీమోథెరపీ వంటి చికిత్సల వల్ల ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, నోటి పుండ్లు, ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
వైద్యుల సూచనల మేరకు పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా తినలేకపోతే కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడం ఉపయోగపడుతుంది. తగినంత నీరు తాగడం కూడా ముఖ్యం. అయితే ప్రతి రోగి ఆహార అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సలహాతో ఆహార ప్రణాళిక రూపొందించుకోవాలి. వైద్యుల సూచన లేకుండా సప్లిమెంట్లు వాడటం, కఠినమైన డైటింగ్ చేయడం మంచిది కాదు.
ఆరోగ్య పరిస్థితికి తగిన వ్యాయామం చేయండి
క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారు రోజంతా మంచంపైనే ఉండాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరిస్థితి అనుకూలిస్తే వైద్యుల సలహాతో నెమ్మదిగా నడవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. వీటివల్ల కండరాల బలాన్ని కాపాడుకోవడానికి, శారీరక చురుకుదనాన్ని కొనసాగించడానికి, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.
అయితే అందరూ ఒకే విధంగా వ్యాయామం చేయలేరు. తీవ్రమైన అలసట, రక్తహీనత, ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి. శరీరంపై ఒత్తిడి పెంచే వ్యాయామాలకు దూరంగా ఉండాలి. తగినంత నిద్ర, విశ్రాంతి కూడా కోలుకునే ప్రక్రియలో ముఖ్యమైనవే. ఏ వ్యాయామం చేయవచ్చో ముందుగా వైద్యుడిని అడగడం మంచిది.
మానసిక ధైర్యంతో పాటు ఫాలో-అప్ పరీక్షలు తప్పనిసరి
క్యాన్సర్ చికిత్స శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసటకు గురిచేయవచ్చు. భయం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవాలి. అవసరమైతే కౌన్సెలింగ్ సహాయం పొందవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వైద్యుల సూచనల మేరకు ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటి పద్ధతులను పాటించవచ్చు.
చికిత్స పూర్తయిన తర్వాత కూడా వైద్యులను క్రమం తప్పకుండా సంప్రదించడం చాలా ముఖ్యం. వారు సూచించిన సమయానికి ఫాలో-అప్ పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్య పరిస్థితిలో కొత్త మార్పులు కనిపించినా, ఇబ్బందులు పెరిగినా నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్సకు శరీరం ఎలా స్పందిస్తోంది? మరిన్ని పరీక్షలు అవసరమా? అనే విషయాలను వైద్యులు అంచనా వేయగలరు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంమేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.




