Fatty Liver: మందులు లేకుండానే ఫ్యాటీ లీవర్‌ను తగ్గించవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

Fatty Liver: ప్రస్తుత కాలంలో ఫ్యాటీ లీవర్ సమస్య చాలా కామన్ అయిపోయింది.

CR Reddy
Published on: 16 Sept 2026 8:45 AM IST
Fatty Liver
X

Fatty Liver

Fatty Liver: ప్రస్తుత కాలంలో ఫ్యాటీ లీవర్ సమస్య చాలా కామన్ అయిపోయింది. మారుతున్న జీవనశైలి, బిజీ షెడ్యూల్స్, విపరీతంగా జంక్ ఫుడ్ తినడం వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. లీవర్ కణాల్లో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లీవర్ డిసీజ్ (NAFLD) కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ప్రధానంగా ఊబకాయం, మధుమేహం లేదా చెడు జీవనశైలితో ముడిపడి ఉంటుంది. చాలా మంది దీన్ని తేలికగా తీసుకుంటారు కానీ, ఇది శరీరాన్ని రోగుల నిలయంగా మార్చేస్తుంది.

జీవనశైలి మార్పులతో లీవర్ రివర్స్ సాధ్యమేనా?

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎలాంటి మందులు వాడకుండానే వ్యాధిని నయం చేసుకోవచ్చు. అయితే ఇది ఫ్యాటీ లీవర్ ఏ దశలో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మొదటి దశలో (గ్రేడ్ 1) ఉన్న ఫ్యాటీ లీవర్‌ను రివర్స్ చేయడానికి సహనం, కంట్రోల్ డైట్ చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం ద్వారా లీవర్‌లో నిల్వ ఉన్న కొవ్వును గణనీయంగా తగ్గించవచ్చు. అయితే దీనికోసం ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాష్ డైటింగ్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

సరైన ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యం?

డైట్‌ను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా జంక్ ఫుడ్, నూనె పదార్థాలను పూర్తిగా తగ్గించాలి. దీనికి బదులుగా పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, పప్పులు, ప్రొఫ్యూజ్డ్ ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆహార నియమాలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. సైక్లింగ్, వాకింగ్ లేదా స్విమ్మింగ్ వంటి ఏదైనా శారీరక శ్రమను రోజువారీ రొటీన్‌లో చేర్చుకోవడం ద్వారా ఫ్యాటీ లీవర్‌ను వేగంగా తగ్గించుకోవచ్చు.

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?

అన్ని సందర్భాల్లోనూ కేవలం జీవనశైలిని మార్చుకోవడం మాత్రమే సరిపోదు. ఒకవేళ రోగికి డయాబెటిస్, ఊబకాయం, హై కొలెస్ట్రాల్, అధిక లీవర్ ఎంజైమ్‌లు లేదా లీవర్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవడం, రెగ్యులర్ టెస్ట్‌లు చేయించుకోవడం చాలా అవసరం. కొన్ని కేసుల్లో డైట్, ఎక్సర్‌సైజ్ సరిపోకపోవచ్చని, అప్పుడు మెడికేషన్ అవసరం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఫ్యాటీ లీవర్ సమస్య రాగానే ఆందోళన చెందకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుని, ప్రారంభ దశలోనే దాన్ని సరిదిద్దుకోవడం మంచిది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.