Chanakya Niti: మానసిక కుంగుబాటును కలిగించే అంశాలివే.. చాణక్యుడు ఏం చెప్పారంటే
Chanakya Niti: మనల్ని మానసికంగా కుంగుబాటుకు గురిచేసే అంశాల గురించి చాణక్యుడు వివరించిన విషయాలు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Chanakya Niti
Chanakya Niti: మానసికంగా శక్తివంతంగా ఉంటేనే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కోగలుగుతాం. క్లిష్టమైన సమస్య వచ్చినపుడు మానసికంగా కుంగుబాటు కలిగితే, అక్కడితో జీవితంలో ఎదుగుదల ఆగిపోతుంది. కెరీర్, కుటుంబం, కోరికలు ఇలా ఎన్నో అంశాల మధ్య నిత్యం ఒత్తిడికి గురవడం సహజం. ఈ ఒత్తిడి మధ్యలో మానసికంగా దృఢంగా లేకపోతే ప్రతి విషయంలోనూ నైరాశ్యం కమ్మేస్తుంది. దీంతో డిప్రెషన్ లాంటి మానసిక రుగ్మతలు ఎదురవుతాయి. విజయం సాధించాలంటే మానసికంగా స్థిరంగా.. గట్టిగా ఉండాలనే విషయం తెలిసిందే. కొన్ని అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మానసికంగా బలంగా మారడానికి అవకాశం ఉంటుందని ఆచార్య చాణక్యుడు తన నీటి శాస్త్ర లో చెప్పారు. కొన్ని అంశాల కారణంగా మనిషి మానసికంగా బలహీనంగా మారతాడని ఆయన తెలిపారు. ఆ అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెగెటివ్ థింకింగ్:
మనం నిరంతరం ప్రతికూలంగా ఆలోచిస్తే, మన మనస్సు వేగంగా బలహీనపడుతుందని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. మనస్సులోని ప్రతికూల ఆలోచనలు భయం, ఆందోళనతో కూడిన జీవితానికి దారితీస్తాయి. మనం ప్రతికూలంగా మాత్రమే ఆలోచిస్తే, మన సృజనాత్మకత నాశనం అవుతుంది. సమస్యలను పరిష్కరించుకోలేం. అలాగే, మనం ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండడం అవసరం. పాజిటివ్ గా ఆలోచించే వారికీ సమస్యల్ని పరిష్కరించుకోవడం చాలా ఈజీ అవుతుందని చాణక్యుడు చెప్పారు.
చెడు సహవాసం:
చాణక్య నీతి ప్రకారం, మనం చెడ్డవారి సహవాసంలో ఉంటే, మీ మనస్సు చాలా త్వరగా బలహీనపడుతుంది. అవును, మనం ప్రతికూల.. సోమరి వ్యక్తుల స్నేహంలో ఉంటే, మనం కూడా వారిలాగే ఆలోచించడం మొదలు పెడతాం. ప్రతికూల ఆలోచనలే చేస్తాం. అటువంటి వారి ప్రభావంతో మనసు చలించి పోతుంది. ప్రతికూలమైన.. తప్పుడు ఆలోచనలతో మనసు నిండిపోతుంది. దీంతో మానసికంగా బలహీనంగా మారిపోతాం. ఇలాంటప్పుడు జీవితంలో ఏ విషయం గురించి అయినా.. స్పష్టమైన మంచి నిర్ణయం తీసుకోలేమని చాణక్యుడు వివరించారు.
నేర్చుకోవడానికి దూరంగా ఉండటం:
కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా నేర్చుకోవడానికి సంకోచించే వ్యక్తి మనస్సు క్రమంగా బలహీనపడుతుందని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. మనం మన జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు, మన ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది. మన తెలివితేటలు పెరుగుతాయి. సమయానుసారంగా మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. కెరీర్ లో ముందుకు సాగాలంటే ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూనే ఉండాలి. మారుతున్న కాలంతో పాటు మారిపోయే విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే వెనుకపడిపోతాం. అందుకే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేర్చుకునే ఆసక్తి చచ్చిపోతుందో.. కొత్త విషయాలను అర్ధం చేసుకోవాలనే ఆలోచన ఆగిపోతుందో అప్పుడు కెరీర్ లేదా జీవితంలో వెనకపడిపోతాం. దీంతో మానసికంగా ఒత్తిడికి గురై ఇబ్బందులు పడతామని చాణక్య తన నీతి శాస్త్రంలో వెల్లడించారు.
ఒత్తిడి..ఆందోళన:
చాణక్య నీతి ప్రకారం, అధిక ఒత్తిడి.. ఆందోళన మన మనసుకు చాలా హానికరం. మానసిక ప్రశాంతత లేకుండా, మన తెలివి, శ్రద్ధ ఎప్పుడూ ఒక విషయంపై నిలవలేవు. మనం ఒత్తిడికి గురైనప్పుడు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి రెండూ బలహీనపడతాయని ఆచార్య చాణక్య చెప్పారు. కాబట్టి వీలైనంత ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రయత్నించడం ద్వారా మానసికంగా ధృఢంగా ఉండడానికి ప్రయత్నిద్దాం.




