Heart Health: 60 సెకన్లలో మీ గుండె ఆరోగ్యం లెక్కింపు.. ఇంట్లోనే చేసుకోగలిగే 3 సింపుల్ టెస్టులు
Heart Health: మన గుండె ఎంత పదిలంగా ఉందో తెలుసుకోవడానికి ప్రతిసారీ రక్త పరీక్షలు, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని డాక్టర్లు చెబుతున్నారు.
Heart Health
Heart Health: మన గుండె ఎంత పదిలంగా ఉందో తెలుసుకోవడానికి ప్రతిసారీ రక్త పరీక్షలు, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని డాక్టర్లు చెబుతున్నారు. మన శరీరంలో కనిపించే కొన్ని చిన్న చిన్న కదలికలు, సామర్థ్యాల ఆధారంగానే కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని చాలా సులభంగా అంచనా వేయవచ్చు. ఆయన తెలిపిన మూడు విభిన్నమైన టెస్టుల ద్వారా గుండె ఓర్పు, కండరాల బలం, నాడీ వ్యవస్థ పనితీరును క్షణాల్లో తెలుసుకోవచ్చు.
మొదటిది మెట్లు ఎక్కే పరీక్ష. అరవై సెకన్ల సమయంలో గోడను గానీ, పక్కనున్న సపోర్టును గానీ పట్టుకోకుండా 60 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇలా వేగంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు గుండెలో నొప్పి రాకుండా, తీవ్రమైన ఆయాసపడకుండా సులువుగా ఎక్కగలిగితే మీ కార్డియాక్ ఎండ్యూరెన్స్ చాలా అద్భుతంగా ఉన్నట్లే. ఒకవేళ మధ్యలోనే విపరీతమైన అలసట, గుండె భారంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
రెండోది కుర్చీపై కూర్చుని లేచే టెస్టు. ఇది మన శరీర దిగువ భాగం బలాన్ని, కదలికలను తెలియజేస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక సాధారణ కుర్చీలో కూర్చుని, చేతులను ఛాతీపై మడిచి పెట్టుకుని, చేతుల సాయం తీసుకోకుండా లేచి కూర్చోవాలి. 40 ఏళ్లు పైబడిన వారు వరుసగా 16 సార్లు కంటే ఎక్కువసార్లు ఇలా చేయగలిగితే వారి శారీరక దృఢత్వం బాగున్నట్లు లెక్క. 14 సార్ల కంటే తక్కువగా చేస్తే మాత్రం ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.
మూడోది హార్ట్ రేట్ రికవరీ టెస్టు. పరుగు తీయడం, మెట్లు ఎక్కడం లేదా ట్రెడ్‌మిల్‌పై వేగంగా నడవడం లాంటి వ్యాయామాలు మూడేసి నుంచి 5 నిమిషాలు చేయాలి. ఆ వెంటనే మీ నాడి వేగాన్ని పల్స్ రేట్ ద్వారా లెక్కించాలి. ఆ తర్వాత సరిగ్గా ఒక నిమిషం పాటు సంపూర్ణ విశ్రాంతి తీసుకుని మళ్లీ నాడి వేగాన్ని కొలవాలి. ఒక నిమిషం విశ్రాంతి తర్వాత పల్స్ రేట్ 25 కంటే ఎక్కువ తగ్గితే గుండె రికవరీ చాలా బాగున్నట్లు, అదే 12 కంటే తక్కువగా తగ్గితే గుండె ఫిట్‌నెస్ సరిగా లేనట్లు గుర్తించాలి.
ఈ చిన్నపాటి పరీక్షలు ఇంట్లోనే మన గుండె సామర్థ్యాన్ని ప్రాథమికంగా తెలుసుకోవడానికి ఎంతో దోహదపడతాయి. వ్యాయామం పూర్తి చేసిన తర్వాత శరీరం ఎంత వేగంగా మామూలు స్థితికి వస్తుందో గమనించడం ద్వారా ప్రమాదాలను ముందుగానే ఊహించవచ్చు. ఏవైనా లక్షణాల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపించినా, ఆయాసం తగ్గకపోయినా ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.




