Chia Seeds Side Effects: చియా సీడ్స్‌ మంచివే కానీ వీరు మాత్రం తినకూడదట

చియా సీడ్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ బీపీ, షుగర్‌, అలర్జీ, జీర్ణ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Aug 2026 4:30 AM IST
Chia Seeds Side Effects
X

Chia Seeds Side Effects

ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో సూపర్‌ఫుడ్స్‌ జాబితాలో చియా సీడ్స్‌కు ప్రత్యేక స్థానం లభించింది. బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండటం కోసం చాలామంది వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. చియా సీడ్స్‌లో ఫైబర్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రొటీన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

చియా సీడ్స్‌లో అధికంగా ఉండే ఫైబర్‌ జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు కొలెస్ట్రాల్‌ నియంత్రణ, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ వీటిని అందరూ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీర్ణ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త

చియా సీడ్స్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల పరిమిత మోతాదులో తీసుకుంటే మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. కానీ అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

పోషకాల లోపం ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి

చియా సీడ్స్‌లో ఉండే కరిగే ఫైబర్‌ శరీరంలో కొవ్వు, గ్లూకోజ్‌ శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే అధికంగా తీసుకుంటే జింక్‌, కాల్షియం, ఐరన్‌ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పోషకాల లోపంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.

షుగర్‌, బీపీ ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి

చియా సీడ్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కలిగి ఉంటాయి. అయితే మధుమేహం కోసం మందులు లేదా ఇన్సులిన్‌ తీసుకునే వారు ఎక్కువగా తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే చియా సీడ్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ రక్తం పలుచబడేలా చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. బీపీ మందులు లేదా రక్తం గడ్డకట్టకుండా చేసే మందులు వాడుతున్నవారు వీటిని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.

అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది

నువ్వులు, వేరుశనగ, హాజెల్‌నట్స్‌ వంటి ఆహార పదార్థాలకు అలర్జీ ఉన్నవారిలో చియా సీడ్స్‌ తీసుకున్న తర్వాత కూడా ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. దురద, కడుపు నొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

అందువల్ల చియా సీడ్స్‌ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారమే అయినప్పటికీ, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి వాటిని తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story