Childhood Cancer: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు… క్యాన్సర్ కావొచ్చు

Childhood Cancer: పిల్లల్లో వచ్చే క్యాన్సర్ కేసులు పెద్దవారితో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అయినా ఇవి పూర్తిగా అరుదైనవి కాదు.

Mokshith
Published on: 15 March 2026 11:45 AM IST
Childhood Cancer
X

Childhood Cancer: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు… క్యాన్సర్ కావొచ్చు

Childhood Cancer: పిల్లల్లో వచ్చే క్యాన్సర్ కేసులు పెద్దవారితో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అయినా ఇవి పూర్తిగా అరుదైనవి కాదు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 50 వేల నుంచి 75 వేల వరకు పిల్లల్లో క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో కొన్ని లక్ష‌ణాల ద్వారా క్యాన్స‌ర్‌ను ముందుగానే గుర్తించ‌వ‌చ్చు.

పిల్లల్లో క్యాన్సర్ ఎంతవరకు సాధారణం?

చిన్నారుల్లో క్యాన్సర్ పెద్దవారిలా ఎక్కువగా కనిపించదు. కానీ పూర్తిగా అరుదు కూడా కాదు. ప్రతి ఏడాది వేలాది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ రకాలు ల్యూకేమియా (రక్త క్యాన్సర్), లింఫోమా వంటి వ్యాధులు. సరైన సమయంలో పరీక్షలు చేసి చికిత్స ప్రారంభిస్తే పిల్లలు త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే మొదట కనిపించే లక్షణాలను తేలికగా తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా కనిపించే ప్రారంభ లక్షణాలు

కొన్ని లక్షణాలు చిన్న జ్వరం లేదా సాధారణ అనారోగ్యంలా కనిపించవచ్చు. కానీ అవి ఎక్కువ రోజుల పాటు కొనసాగితే జాగ్రత్తగా ఉండాలి. రెండు వారాలకు పైగా జ్వ‌రం కొన‌సాగ‌డం, తరచుగా అలసటగా ఉండటం, కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం, ముఖం పసుపు రంగులో కనిపించడం వంటి ల‌క్ష‌ణాలు ఒకటి లేదా రెండు రోజుల‌కు తగ్గిపోతే పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ ఎక్కువ రోజులు కొనసాగితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

శరీరంలో కనిపించే హెచ్చరిక సంకేతాలు

కొన్ని లక్షణాలు శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి ఉంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. మెడ, బుగ్గల దగ్గర లేదా పొట్టలో గడ్డలు కనిపించడం. ముక్కు నుంచి తరచుగా రక్తం రావడం, దవడల నుంచి రక్తం కారడం,

చర్మంపై చిన్న ఎర్రటి మచ్చలు కనిపించడం, ఎముకలు లేదా కీళ్లలో నొప్పి, పిల్లలు నడిచేటప్పుడు కుంటుతూ నడవడం, రాత్రివేళల్లో ఎక్కువ నొప్పి గురించి చెప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో పిల్లల్లో మెదడు ట్యూమర్లు లేదా ఇతర ట్యూమర్లు కూడా కనిపించవచ్చు. వాటికి సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.

ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పి, తలనొప్పితో పాటు వాంతులు, చూపు సమస్యలు, నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం, పొట్టలో వాపు లేదా గడ్డ కనిపించడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించి అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

తల్లిదండ్రులు ఏమి చేయాలి?

పిల్లల్లో పై లక్షణాలు రెండు వారాలకు పైగా కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సాధారణంగా రక్త పరీక్షలు, స్కానింగ్ వంటి పరీక్షల ద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది. అందుకే పిల్లల్లో తరచుగా కనిపించే అసాధారణ లక్షణాలను చిన్న సమస్యగా తీసుకోకుండా, సమయానికి పరీక్షలు చేయించడం ఎంతో అవసరం. ముందస్తు జాగ్రత్తలతో పిల్లలను ఈ ప్రమాదకర వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు.

Mokshith

Mokshith

Next Story