Cleaning Tips: మీ స్విచ్ బోర్డులు కూడా జిడ్డుగా మారాయా? సింపుల్ టిప్స్ త‌ళుక్కుమంటాయి

Cleaning Tips: ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసినా చాలా మంది దృష్టికి రాని వస్తువుల్లో స్విచ్ బోర్డులు ఒకటి. కాలక్రమేణా వాటిపై దుమ్ము, మురికి, వేళ్ల ముద్రల వ‌ల్ల‌ జిడ్డుగా మారుతాయి.

Mokshith
Published on: 15 July 2026 2:58 PM IST
Cleaning Tips
X

Cleaning Tips: మీ స్విచ్ బోర్డులు కూడా జిడ్డుగా మారాయా? సింపుల్ టిప్స్ త‌ళుక్కుమంటాయి

Cleaning Tips: ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసినా చాలా మంది దృష్టికి రాని వస్తువుల్లో స్విచ్ బోర్డులు ఒకటి. కాలక్రమేణా వాటిపై దుమ్ము, మురికి, వేళ్ల ముద్రల వ‌ల్ల‌ జిడ్డుగా మారుతాయి. దీంతో ఇల్లు మొత్తం శుభ్రంగా ఉన్నా స్విచ్ బోర్డులు మాత్రం పాతవిగా కనిపిస్తాయి. అయితే ఖరీదైన క్లీనింగ్ లిక్విడ్లు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులతో స్విచ్ బోర్డులను సులభంగా శుభ్రం చేసి మళ్లీ కొత్తవిలా మెరిపించవచ్చు.

తెల్లటి టూత్‌పేస్ట్‌తో సులభంగా శుభ్రం చేయండి

స్విచ్ బోర్డుపై తేలికపాటి మురికి లేదా పసుపు రంగు కనిపిస్తే సాధారణ తెల్లటి టూత్‌పేస్ట్‌తో చెక్ పెట్టొచ్చు. పాత టూత్‌బ్రష్‌పై కొద్దిగా టూత్‌పేస్ట్ తీసుకుని స్విచ్ బోర్డుపై మెల్లగా రుద్దాలి. ముఖ్యంగా అంచులు, మూలల్లో పేరుకున్న మురికిని శుభ్రం చేయడానికి కొద్దిసేపు బ్రష్ చేయాలి. ఆ తర్వాత పొడి, శుభ్రమైన గుడ్డతో తుడిస్తే స్విచ్ బోర్డు మళ్లీ మెరిసిపోతుంది. జెల్ టూత్‌పేస్ట్ కంటే సాధారణ తెల్లటి టూత్‌పేస్ట్ ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

నిమ్మకాయ, ఉప్పుతో మొండి మురికిని తొలగించండి

స్విచ్ బోర్డుపై ఎక్కువ రోజులుగా పేరుకుపోయిన మురికి ఉంటే నిమ్మకాయ, ఉప్పు మిశ్రమం ఉపయోగించవచ్చు. స‌గం నిమ్మకాయపై కొద్దిగా ఉప్పు చల్లి, దానితో స్విచ్ బోర్డును మెల్లగా రుద్దాలి. నిమ్మకాయలో ఉండే సహజ ఆమ్లం మురికిని వదులుగా చేస్తే, ఉప్పు తేలికపాటి స్క్రబ్బర్‌లా పనిచేసి మరకలను తొలగిస్తుంది. తర్వాత పొడి గుడ్డతో తుడిస్తే బోర్డు శుభ్రంగా కనిపిస్తుంది. ఈ పద్ధతి ప్లాస్టిక్‌కు పెద్దగా హాని కలిగించకుండా శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.

మొండి మరకలకు నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించవచ్చు

కొన్ని సందర్భాల్లో స్విచ్ బోర్డులపై ఇంక్ మరకలు, నల్లటి మచ్చలు లేదా చాలా రోజులుగా ఉన్న మొండి మరకలు కనిపిస్తాయి. అలాంటి వాటిని తొలగించడానికి కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్‌ను పత్తి లేదా మెత్తని గుడ్డపై తీసుకుని మరకలపై మెల్లగా తుడవాలి. ఇందులో ఉండే అసిటోన్ కఠినమైన మరకలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. అయితే దీనిని ఎక్కువ పరిమాణంలో ఉపయోగించకూడదు. ముందుగా కనిపించని చిన్న భాగంలో పరీక్షించి, ఎలాంటి సమస్య లేకపోతే మాత్రమే మిగతా భాగంలో ఉపయోగించడం మంచిది.

శుభ్రం చేసే సమయంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

స్విచ్ బోర్డులను శుభ్రం చేసే ముందు తప్పనిసరిగా విద్యుత్ సరఫరాను ఆఫ్ చేయాలి. శుభ్రం చేసే సమయంలో చేతులు పూర్తిగా పొడిగా ఉండాలి. తడి గుడ్డలు లేదా ఎక్కువ నీటిని ఉపయోగించడం ప్రమాదకరం. నిమ్మరసం లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ వంటి ద్రవాలను ఉపయోగించిన తర్వాత స్విచ్ బోర్డు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే విద్యుత్‌ను ఆన్ చేయాలి. అలాగే తడి చేతులతో లేదా చెప్పులు లేకుండా స్విచ్‌లు, ప్లగ్‌లు, విద్యుత్ వైర్లను తాకకుండా జాగ్రత్త పడాలి. వీలైతే ఇంట్లో మెయిన్ ఆఫ్ చేసి శుభ్రం చేస్తీ మ‌రీ మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story