Corona Symptoms: కరోనా, వైరల్ ఫీవర్ రెండూ ఒకేలా అనిపిస్తున్నాయా? తేడా ఇదే!

కరోనా, సాధారణ జలుబు లక్షణాల మధ్య తేడా ఏంటి? ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి? వైద్యులు సూచించిన కీలక జాగ్రత్తలు ఇవే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 July 2026 1:40 AM IST
Corona Symptoms
X

Corona Symptoms

దేశంలో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 19 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కడప జిల్లాలో ఎనిమిది కేసులు గుర్తించారు. తాజా కేసులకు ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 సబ్‌వేరియంట్ కారణమని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇదే సమయంలో వర్షాకాలం కావడంతో సాధారణ జలుబు, వైరల్ జ్వరం కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో తమకు వచ్చిన లక్షణాలు సాధారణ ఫ్లూ కారణమా, లేక కోవిడ్-19 సోకిందా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. దీనిపై ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

వైద్యుల ప్రకారం ప్రస్తుతం కోవిడ్ సోకిన చాలా మందిలో గొంతు నొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, తేలికపాటి నుంచి మోస్తరు జ్వరం, పొడి దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో వాసన లేదా రుచి కోల్పోవడం కూడా కనిపించవచ్చు. అయితే గతంతో పోలిస్తే ఈ లక్షణం ఇప్పుడు తక్కువగా నమోదవుతోంది.

సాధారణ వైరల్ జ్వరంతో పోలిస్తే కోవిడ్ లక్షణాలు నెమ్మదిగా 2 నుంచి 5 రోజుల్లో బయటపడతాయని వైద్యులు చెబుతున్నారు. వైరల్ జ్వరం సాధారణంగా మూడు నుంచి ఐదు రోజుల్లో తగ్గిపోతే, కోవిడ్‌లో అలసట, నీరసం వంటి సమస్యలు మరికొన్ని వారాలు కొనసాగవచ్చు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం వంటి లక్షణాలు కోవిడ్‌లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

అయితే కేవలం లక్షణాల ఆధారంగా కోవిడ్‌ను నిర్ధారించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్, వైరల్ ఫ్లూ, సాధారణ జలుబు లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉంటాయని, కాబట్టి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లేదా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవడం ద్వారా మాత్రమే ఖచ్చితమైన నిర్ధారణ సాధ్యమవుతుందని సూచిస్తున్నారు.

60 ఏళ్లు దాటినవారు, గర్భిణులు, చిన్నారులు, అలాగే మధుమేహం, గుండె జబ్బులు, ఆస్తమా, కిడ్నీ వ్యాధులు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతినొప్పి, స్పృహలో మార్పులు, మూడు రోజులకు మించి జ్వరం తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.

వర్షాకాలంలో రద్దీ ప్రాంతాల్లో ఎన్95 లేదా కేఎన్95 మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, జ్వరం లేదా దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్స్ వాడకూడదని, కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్ని వారాలు తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరమని నిపుణులు పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story