DINK Lifestyle: యువతలో పెరుగుతున్న డింక్ లైఫ్‌స్టైల్...45 ఏళ్ల తరువాత రిటైర్మెంట్
DINK Lifestyle: మారుతున్న కాలంతో పాటు యువతరం ఆలోచనలు, ప్రాధాన్యతలు శరవేగంగా మారుతున్నాయి.
DINK Lifestyle
DINK Lifestyle: మారుతున్న కాలంతో పాటు యువతరం ఆలోచనలు, ప్రాధాన్యతలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే నేటి తరం జంటలు ‘డింక్’ సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తూ, పిల్లలు వద్దనుకునే ఈ జీవనశైలి మెట్రో నగరాల్లో ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. ఈ విధానం వల్ల 40 నుంచి 45 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేసి, శేష జీవితాన్ని తమకు నచ్చినట్లు గడపాలని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమౌతుంది.
ఆర్థిక స్వేచ్ఛకు రహదారి
ఈ లైఫ్‌స్టైల్‌లో ప్రధానంగా కనిపించే అంశం ఆర్థిక స్వేచ్ఛ. ఇద్దరి ఆదాయం ఉండటం వల్ల నెలకు వచ్చే సంపాదన రెట్టింపు అవుతుంది. పిల్లల చదువు, ఆరోగ్యం, పెంపకం వంటి ఖర్చులు లేకపోవడంతో, జంటలు తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని సేవ్ చేసి పెట్టుబడులుగా మార్చుకుంటున్నారు. కాంపౌండింగ్ ప్రభావంతో 10-15 ఏళ్లలోనే మంచి సంపద సృష్టించగలుగుతున్నారు. ముఖ్యంగా స్టాక్‌మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెడుతూ కావాల్సినంత అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అదే పిల్లలు ఉంటే ఆదాయంలో సుమారు 30 నుంచి 40 శాతం వరకు వీరికోసమే ఖర్చు చేయవలసి వస్తుంది.
ఇక జీవనశైలిలో కూడా పెద్ద మార్పు కనిపిస్తుంది. డింక్ జంటలకు వ్యక్తిగత సమయం ఎక్కువగా దొరుకుతుంది. ట్రావెలింగ్, ఫిట్‌నెస్, హాబీస్ వంటి విషయాల్లో స్వేచ్ఛగా ముందుకు వెళ్లగలుగుతున్నారు. ఉద్యోగ మార్పులు, విదేశీ అవకాశాలు కూడా వీరికి సులభంగా అందుబాటులో ఉంటాయి. మానసిక ఒత్తిడి తక్కువగా ఉండటంతో, జీవితం క్వాలిటీగా మారుతోంది.
ప్రతికూల పరిస్థితులు
డింక్ లైఫ్‌స్టైల్‌లో ఎన్ని లాభాలు ఉన్నా, కొన్ని సామాజిక, మానసిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు లేదా భాగస్వామి దూరమైనప్పుడు, భావోద్వేగంగా తోడుగా ఉండే పిల్లలు లేకపోవడం పెద్ద లోటుగా మారవచ్చు. అలాగే మన సమాజంలో పిల్లలు లేకపోవడాన్ని ఇప్పటికీ పూర్తిగా అంగీకరించని వాతావరణం ఉండటం వల్ల కొన్ని సామాజిక ఒత్తిళ్లు ఎదురవుతాయి. ‘డింక్’ లైఫ్‌స్టైల్ అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఆర్థిక స్వేచ్ఛ, స్వతంత్ర జీవితం ఇస్తున్నా, భవిష్యత్‌లో వచ్చే ఒంటరితనం వంటి అంశాలను కూడా ముందుగానే ఆలోచించడం అవసరం.




