Sugar: చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా.? అసలు నిజం ఇదిగో..

Sugar: చక్కెర తింటే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో విపరీతంగా జరుగుతున్న ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ వర్తిక విశ్వాని స్పష్టం చేశారు.

Ravi
By Ravi
Published on: 21 Jun 2026 12:38 PM IST
Sugar
X

Sugar: చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా.? అసలు నిజం ఇదిగో..

Sugar: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో రకాల అపోహలు, తప్పుడు వార్తలు ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్తున్నాయి. అందులో ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రచారం.. "చక్కెర ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా?" అనేది. ఈ భయంతో చాలామంది స్వీట్లకు, చివరకు తీయగా ఉండే పండ్లకు కూడా దూరమవుతూ తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ వర్తిక విశ్వాని స్పష్టం చేశారు. చక్కెర తినడం వల్లనే క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇదొక అపోహ మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు. కేకులు, చాక్లెట్లు లేదా ఇతర తీపి పదార్థాలు తీసుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందనే భయం ఏమాత్రం అవసరం లేదని ఆమె వివరించారు.

అయితే, క్యాన్సర్ రాదు కదా అని చక్కెరను ఇష్టానుసారంగా మోతాదుకు మించి తినడం కూడా ఏమాత్రం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఏ పదార్థమైనా సరే మితంగా తీసుకున్నంత కాలం అది శరీరానికి ఎలాంటి హాని చేయదు. ఒక వ్యక్తి ఆరోగ్యం అనేది పూర్తిగా వారి రోజువారీ జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుందని డాక్టర్ వర్తిక వెల్లడించారు. శారీరక వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, కల్తీ ఆహారం తీసుకోవడం వంటి ఇతర కారణాల వల్లే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయి తప్ప, కేవలం చక్కెర తినడం వల్లే క్యాన్సర్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

ఇకపోతే, ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు హెల్త్, డైట్ ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలు విని ప్రజలు తమ సహజమైన ఆహారపు అలవాట్లను పూర్తిగా మానేస్తుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలనో లేదా బరువు తగ్గాలనో ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పినట్లుగా పండ్లు, తృణధాన్యాలు, స్వచ్ఛమైన ఇంటి భోజనాన్ని పూర్తిగా మానేయడం అన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైన విషయమని డాక్టర్ వర్తిక విశ్వాని హెచ్చరించారు. శరీరానికి అవసరమైన సహజమైన పోషకాలు పండ్లు, ఇంట్లో వండిన భోజనం ద్వారానే పుష్కలంగా అందుతాయని, వాటిని మానేయడం వల్ల రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆమె వివరించారు. కాబట్టి ఇంటర్నెట్‌లో వచ్చే ప్రతి ఆరోగ్య సలహాను గుడ్డిగా నమ్మకుండా, నిపుణులైన వైద్యులను సంప్రదించి సరైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story