Health: చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా.? ఇందులో నిజమెంత ఉంది
Health: సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Health: చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా.? ఇందులో నిజమెంత ఉంది
Health: సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా "చక్కెర తింటే క్యాన్సర్ వస్తుంది", "షుగర్ క్యాన్సర్ కణాలకు ఆహారం" వంటి వాదనలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?
చాక్లెట్లు, కేకులు, పేస్ట్రీలు లేదా చక్కెర ఉన్న ఆహారం తిన్నంత మాత్రాన భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందని చెప్పే శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ప్రతి విషయాన్ని నమ్మకుండా, శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించాలని సూచిస్తున్నారు.
PET స్కాన్‌లలో కనిపించే నిజం ఏంటి?
చాలా మంది సోషల్ మీడియా నిపుణులు PET స్కాన్‌లలో వెలుగుతూ కనిపించే భాగాలు చక్కెరను ఎక్కువగా తీసుకున్న క్యాన్సర్ కణాలని చెబుతుంటారు. అయితే ఇది పూర్తిగా సరైన వివరణ కాదని అంటున్నారు. PET స్కాన్‌లో క్యాన్సర్ కణాలతో పాటు మెదడు, మూత్రపిండాలు, పేగులు వంటి అవయవాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. ఎందుకంటే శరీరంలో చురుకుగా పనిచేసే ప్రతి జీవకణానికి శక్తి కోసం గ్లూకోజ్ అవసరమవుతుంది.
మన శరీరానికి చక్కెర ఎందుకు అవసరం?
చక్కెర లేదా గ్లూకోజ్ మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. మెదడు, గుండె, మూత్రపిండాలు వంటి కీలక అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే శక్తి అవసరం. పూర్తిగా చక్కెర తీసుకోవడం మానేస్తే శరీరం శక్తి కోసం కండరాలను, ఇతర కణజాలాన్ని వినియోగించడం ప్రారంభిస్తుంది, అందుకే చక్కెరను పూర్తిగా శత్రువుగా చూడటం సరైన విధానం కాదనేది నిపుణుల అభిప్రాయం.
ఉపవాసం చేస్తే క్యాన్సర్ కణాలు చనిపోతాయా?
క్యాన్సర్ కణాలు సాధారణ కణాల కంటే వేగంగా పెరుగుతాయి కాబట్టి ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. అయితే అందుకే ఆహారం మానేయడం లేదా ఉపవాసం చేయడం వల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయని అనుకోవడం తప్పు.
నిజానికి దీర్ఘకాల ఉపవాసం శరీరాన్ని మరింత బలహీనపరచవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.
అసలు ప్రమాదం ఎక్కడ ఉంది?
చక్కెర కంటే అధిక బరువు, ఊబకాయం, మధుమేహం వంటి మెటబాలిక్ సమస్యలు భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం అనారోగ్యకర జీవనశైలి. ప్రతిరోజూ గులాబ్ జామున్, పేస్ట్రీలు, స్వీట్లు తినడం మంచిది కాదు. అలాగే పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పూర్తిగా మానేయడం కూడా హానికరమే.




