Fatty Liver: ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టే 5 సూపర్‌డ్రింక్స్ ఇవే
Fatty Liver: ఉసిరి రసం, గ్రీన్ టీ, గోరువెచ్చని నిమ్మరసం, బ్లాక్ కాఫీ, మజ్జిగ లాంటి పానీయాలు కాలేయంలోని కొవ్వును కరిగించడంలో ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.
Fatty Liver
Fatty Liver: ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కాలేయంపై కొవ్వు చేరుతోంది. అయితే సరైన పానీయాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?
మన కాలేయంలో ఐదు శాతానికంటే ఎక్కువ కొవ్వు చేరితే దానిని ఫ్యాటీ లివర్‌గా గుర్తిస్తారు. సరిగా లేని ఆహారపు అలవాట్లు, అధిక క్యాలరీల ఆహారం తీసుకోవడం, జీవక్రియల మందగమనం దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. మొదట్లోనే ఈ సమస్యను గుర్తించి జాగ్రత్తపడకపోతే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. మందులతో పాటు నిత్యం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. కొన్ని సహజసిద్ధమైన పానీయాలు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి.
ఉసిరి రసం, గ్రీన్ టీలతో కొవ్వుకు చెక్
కాలేయంలోని కొవ్వును కరిగించడంలో ఉసిరి రసం మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇందులో లభించే విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. అంతేకాక లిపిడ్ మెటాబాలిజాన్ని మెరుగుపరచి నిల్వ ఉన్న కొవ్వును వేగంగా కరిగిస్తాయి. దీనితో పాటు గ్రీన్ టీ కూడా ఫ్యాటీ లివర్‌పై అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్లు, ఈజీసీజీ కాంపౌండ్లు కాలేయంలో కొవ్వు ఆక్సీకరణను పెంచి, కణాల వాపును తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.
పరగడుపున గోరువెచ్చని నిమ్మరసం, బ్లాక్ కాఫీ
ఉదయం నిద్రలేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగడం వల్ల కాలేయం సహజ సిద్ధంగా శుభ్రపడుతుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి శరీరానికి అవసరమైన తేమను, విటమిన్ సీని అందిస్తుంది. ఇక నాలుగో పానీయం బ్లాక్ కాఫీ. పాలు, చక్కెర లేకుండా తయారుచేసే ఈ బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ కాలేయంలో ఏర్పడే వాపును అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయ కణాలకు రక్షణ లభిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మజ్జిగ ప్రయోజనాలు
ఐదో పానీయం మనందరికీ అందుబాటులో ఉండే చల్లటి మజ్జిగ. మజ్జిగలో ఉండే ప్రొబయోటిక్స్ కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. అందులో కాస్త వేగించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగితే జీర్ణశక్తి గణనీయంగా పెరుగుతుంది. కేవలం పానీయాలు తాగితేనే ఫ్యాటీ లివర్ నయం కాదని, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. నిత్యం శారీరక వ్యాయామం చేస్తూ, క్యాలరీలు తక్కువగా ఉండే పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మాత్రమే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది.
నిపుణుల సలహాలు
ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా సమగ్రమైన జీవనశైలి మార్పులే అసలైన పరిష్కారం. పైన పేర్కొన్న పానీయాలను దినచర్యలో భాగం చేసుకుంటూనే అనారోగ్యకరమైన నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. సరైన నిద్ర, తగినంత నీరు తాగడం వల్ల కాలేయం త్వరగా కోలుకుంటుంది. ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఫ్యాటీ లివర్‌ను సులభంగా రివర్స్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.




