Ear Care: చెవులను తరచుగా క్లీన్ చేసుకునే అలవాటు ఉందా? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే

Ear Care: చాలా మంది చెవులలో పేరుకుపోయే గూబిలిని మంచిది కాదని భావించి ప్రతిరోజూ లేదా తరచుగా శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

CR Reddy
Published on: 12 Sept 2026 8:24 AM IST
Ear Care
X

Ear Care

Ear Care: చాలా మంది చెవులలో పేరుకుపోయే గూబిలిని మంచిది కాదని భావించి ప్రతిరోజూ లేదా తరచుగా శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం ఈ అలవాటు చెవి ఆరోగ్యానికి ఎంతో హానికరమని తేలింది. వైద్య పరిభాషలో చెవి గూబిలిని సెరుమెన్ అని పిలుస్తారు. చెవి కాలువలో ఉండే గ్రంథులు సహజసిద్ధంగా దీనిని ఉత్పత్తి చేస్తాయి. చాలా మంది దీనిని మురికిగా భావించి ఇయర్ బడ్స్ అలాగే పదునైన వస్తువులను ఉపయోగించి శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజానికి ఈ గూబిలి చెవికి ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. దుమ్ము, ధూళి, క్రిములు అలాగే చిన్న పురుగులు నేరుగా చెవి పొరను చేరకుండా ఇది అడ్డుకుంటుంది. అంతేకాకుండా చెవి లోపలి చర్మానికి తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది.

తరచుగా క్లీన్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు

కాటన్ బడ్స్ లేదా ఇతర పదునైన వస్తువులను చెవిలో పెట్టి శుభ్రం చేయడానికి ప్రయత్నించినప్పుడు గూబిలి బయటకు రాకపోగా లోపలికి మరింత నెట్టబడుతుంది. దీనివల్ల చెవిలో గూబిలి గడ్డకట్టుకుపోయి తీవ్రమైన నొప్పి, వినికిడి శక్తి తగ్గడం, చెవులలో హోరు శబ్దాలు రావడం అలాగే మైకం కమ్మడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాలలో ఈ అలవాటు చెవి పొరను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది.

చెవిని శుభ్రం చేసుకునే సరైన పద్ధతులు

చెవిలో ఎలాంటి ఇబ్బంది లేనంతవరకు దానిని శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. చెవి తనను తాను సహజంగానే శుభ్రపరుచుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఎప్పుడైనా వినికిడి సమస్య కలిగినా లేదా చెవిలో నొప్పిగా అనిపించినా వైద్యులను సంప్రదించడం మంచిది. చెవి బాహ్య భాగాన్ని మాత్రమే మెత్తని, శుభ్రమైన తడి గుడ్డతో సున్నితంగా తుడవాలి. ఇయర్ బడ్స్, హెయిర్ పిన్స్, తాళం చెవులను ఎట్టి పరిస్థితుల్లోనూ చెవిలో పెట్టకూడదు.

చెవి గూబిలి శత్రువుగా కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడే మిత్రుడిగా భావించాలి. అనవసరమైన అలవాట్లతో చెవిని పాడుచేసుకోకుండా నిపుణుల సలహా మేరకు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.