హైదరాబాద్ కళా ప్రపంచంలో ‘ఏక్ చిత్ర’కు కొత్త స్థానం
అన్నపూర్ణ మడిపడిగ ప్రారంభించిన ‘ఏక్ చిత్ర’ హైదరాబాద్‌లో విభిన్న కళారూపాలకు వేదికగా మారుతూ కొత్త సాంస్కృతిక అనుభూతిని అందించనుంది.
హైదరాబాద్ కళా ప్రపంచంలో ‘ఏక్ చిత్ర’కు కొత్త స్థానం
హైదరాబాద్ నగరానికి మరో కొత్త కళా వేదిక అందుబాటులోకి వచ్చింది. కళాకారిణి, క్యూరేటర్ అన్నపూర్ణ మడిపడిగ ప్రారంభించిన ‘ఏక్ చిత్ర’ ఆర్ట్ గ్యాలరీ విభిన్న కళారూపాలకు ఒకే వేదికగా నిలవనుంది. నగరంలోని ఆరవ అంతస్తులో ఉన్న ఈ గ్యాలరీ నుంచి బయటకు చూస్తే హైదరాబాద్ విస్తీర్ణం మొత్తం కళ్లముందు కనిపిస్తుంది. ఎత్తైన భవనాల మధ్య దూరంగా కనిపించే సరస్సు, కింద విస్తరించిన నగరం.. గ్యాలరీకి ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
కళతో అన్నపూర్ణకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. చిన్నతనంలోనే పూల కుండీలకు రంగులు వేయడం, పువ్వులు, మొక్కలను సేకరించి వాటితో చిన్న కళాఖండాలు తయారు చేయడం, థర్మోకోల్‌తో బొమ్మలు రూపొందించడం ఆమెకు ఇష్టమైన పనులు. ఇంట్లోనూ కళకు కొదవ లేదు. ప్రముఖ చిత్రకారుడు రోహిణి కుమార్ కుమార్తెగా పెరిగిన ఆమె చిన్నప్పటి నుంచే చిత్రకళ, కళాకారులు, ప్రదర్శనలకు దగ్గరయ్యారు.
తండ్రితో కలిసి కళా ప్రదర్శనలకు వెళ్లడం, ప్రముఖ కళాకారులతో ఆయనకు ఉన్న పరిచయాలను గమనించడం ఆమెపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా తన తండ్రికి గురువైన ప్రముఖ చిత్రకారుడు శేషగిరి రావు చిత్రాలు వేస్తున్నప్పుడు వాటిని ఆసక్తిగా గమనించేవారు. ఆ అనుభవాలే ఆమెకు తెలియకుండానే కళ వైపు తీసుకెళ్లాయి.
అయితే చదువు విషయంలో మాత్రం ఆమె ప్రయాణం కొంత భిన్నంగా సాగింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇతరుల సూచనతో కామర్స్ కోర్సులో చేరారు. కానీ మూడు రోజుల్లోనే అది తనకు సరైన దారి కాదని అర్థమైంది. తనకు నచ్చిన రంగంలోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఆమెకు తండ్రి కూడా మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
కళతో పాటు ఇతర రంగాల్లోనూ తనను తాను పరీక్షించుకున్నారు అన్నపూర్ణ. కొంతకాలం బ్యాంకు రుణం తీసుకుని ఫ్యాషన్ బోటిక్ నిర్వహించారు. ఆ అనుభవం కూడా ఆమెకు కొత్త విషయాలు నేర్పింది. కానీ ఎన్ని మార్గాలు చూసినా చివరకు తన మనసు కళ దగ్గరే ఆగిపోతుందని ఆమెకు స్పష్టమైంది. అక్కడి నుంచి కళాకారిణిగా కొనసాగుతూనే క్యూరేటింగ్ వైపు అడుగులు వేశారు.
హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై నగరాల్లో 25కు పైగా ప్రదర్శనలను క్యూరేట్ చేసిన అన్నపూర్ణకు ఈ క్రమంలో ఒక విషయం స్పష్టమైంది. హైదరాబాద్‌లో కళాకారులకు, కళాభిమానులకు మంచి వేదికలు ఉన్నప్పటికీ, అనేక కళారూపాలను ఒకే చోటకు తీసుకువచ్చే పెద్ద స్థాయి సాంస్కృతిక ప్రదేశం అవసరమని ఆమె భావించారు. ఆ ఆలోచన నుంచే ‘ఏక్ చిత్ర’ రూపుదిద్దుకుంది.
పేరు ఒకటే అయినా.. ఇందులో కనిపించే కళారూపాలు మాత్రం ఎన్నో. పెయింటింగ్స్, శిల్పాలు, సిరామిక్స్, వస్త్రకళ, ఫొటోగ్రఫీ, ఇన్‌స్టలేషన్స్, మిక్స్‌డ్ మీడియా వంటి విభిన్న రూపాలకు ఇక్కడ చోటు కల్పించనున్నారు. కళను ఒకే పరిధిలో చూడకుండా, ఒక కళారూపం మరోదానితో ఎలా కలుస్తుందో చూపించే ప్రయత్నం చేయనున్నారు.
గ్యాలరీలో ఏర్పాటు చేసిన శాశ్వత ప్రింట్‌మేకింగ్ స్టూడియో కూడా ప్రత్యేకంగా నిలవనుంది. ఈ మాధ్యమంపై ఆసక్తి ఉన్న కళాకారులకు ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి, ఒకరితో ఒకరు తమ అనుభవాలను పంచుకోవడానికి ఇది ఉపయోగపడనుంది.
‘ఏక్ చిత్ర’లో కేవలం ప్రదర్శనలు మాత్రమే ఉండవు. కళాకారులతో ముఖాముఖి సంభాషణలు, స్క్రీనింగ్‌లు, విద్యా కార్యక్రమాలు, ప్రజా చర్చలు, ప్రత్యక్ష ప్రదర్శనలు వంటి కార్యక్రమాలకూ వేదిక కల్పించనున్నారు. దీంతో గ్యాలరీని కేవలం కళాఖండాలు చూసి వెళ్లే ప్రదేశంగా కాకుండా, కళ గురించి మాట్లాడుకునే, తెలుసుకునే స్థలంగా తీర్చిదిద్దాలని అన్నపూర్ణ భావిస్తున్నారు.
ఇక గ్యాలరీ కార్యకలాపాలను నగరంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకూ తీసుకెళ్లే ప్రణాళికలు ఉన్నాయి. ‘లివింగ్ టెంపుల్’ ద్వారా వారసత్వ కట్టడాలను కొత్త సాంస్కృతిక కోణంలో పరిచయం చేయాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల కళా చరిత్ర, సాంస్కృతిక కథనాలపై దృష్టి పెట్టే ‘కీర్తనం’తో పాటు, చారిత్రక మెట్ల బావులను కేంద్రంగా చేసుకుని ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, హెరిటేజ్ వాక్‌లు నిర్వహించే ‘బయోలి ఆర్ట్ సంగం’ కార్యక్రమాలకూ సన్నాహాలు జరుగుతున్నాయి.
అన్నపూర్ణ దృష్టిలో కళ అంటే గోడపై వేలాడే పెయింటింగ్ మాత్రమే కాదు. అది మన చుట్టూ ఉన్న సమాజంతో, సంస్కృతితో, మన రోజువారీ జీవితంతో ముడిపడి ఉంటుంది. ఆ ఆలోచనతోనే ‘ఏక్ చిత్ర’ను రూపొందించారు. విభిన్న కళాకారులు, కళారూపాలు, ఆలోచనలు ఒకచోట కలిసే ఈ వేదిక హైదరాబాద్ కళా ప్రపంచానికి కొత్త అనుభూతిని అందించనుంది.




