Eye Problems: కంటి సమస్యలు బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Eye Problems: చాలామందికి కంటి చూపు మసకబారడం, డబుల్ విజన్ రావడం, చూపు తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తే..
Eye Problems: చాలామందికి కంటి చూపు మసకబారడం, డబుల్ విజన్ రావడం, చూపు తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తే.. కళ్లద్దాలు మార్చుకోవాల్సి వచ్చిందేమో లేదా కంటి సమస్య అనుకుంటారు. కానీ వైద్యుల అభిప్రాయం ప్రకారం కొన్ని సందర్భాల్లో ఇవి కేవలం కంటి సమస్యలు కాకుండా బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా ప్రారంభ సంకేతాలు కావచ్చు.
ప్రతి కంటి సమస్యకు కారణం కళ్లే కావాల్సిన అవసరం లేదు
మన కళ్లకు, మెదడుకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. మనం చూసే ప్రతి దృశ్యం కళ్ల నుంచి ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకు చేరుతుంది. అక్కడ మెదడు ఆ సమాచారాన్ని విశ్లేషించి మనకు అర్థమయ్యేలా చేస్తుంది.
ఈ ప్రక్రియలో ఎక్కడైనా ట్యూమర్ ఏర్పడినా, మెదడుపై ఒత్తిడి పెరిగినా లేదా నరాల్లో సమస్య వచ్చినా మొదటగా కంటి చూపులో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే కంటి సమస్యలు కనిపిస్తే కేవలం కంటి పరీక్షతో సరిపెట్టకుండా అవసరమైతే న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.
బ్రెయిన్ ట్యూమర్ ఉంటే కనిపించే కంటి లక్షణాలు ఇవే
బ్రెయిన్ ట్యూమర్ కారణంగా కంటి సమస్యలు ఏర్పడితే కొన్ని సాధారణ లక్షణాలు కనిపించవచ్చు. చూపు మసకబారడం, ఒకే వస్తువు రెండు కనిపించడం (డబుల్ విజన్), పక్కవైపు కనిపించే దృష్టి తగ్గిపోవడం, క్రమంగా చూపు బలహీనపడటం, తరచూ తలనొప్పితో పాటు చూపులో మార్పులు రావడం. ఇలాంటి లక్షణాలు కొన్ని రోజులకు మించి కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
ఈ రకాల బ్రెయిన్ ట్యూమర్లలో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లు మొదట కంటి సమస్యల రూపంలోనే బయటపడతాయి.
పిట్యూటరీ అడెనోమా: ఇది సాధారణంగా పిట్యూటరీ గ్రంథి దగ్గర ఏర్పడే ట్యూమర్. చాలా సందర్భాల్లో ఇది ప్రమాదకరం కాకపోయినా, క్రమంగా కంటి చూపును ప్రభావితం చేస్తుంది. ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది ఆలస్యంగా గుర్తిస్తారు.
క్రేనియోఫారింజియోమా: ఈ ట్యూమర్ పిల్లల్లోనూ, పెద్దల్లోనూ కనిపించవచ్చు. ఇది కూడా పిట్యూటరీ గ్రంథి సమీపంలో ఏర్పడి కంటి చూపుతో పాటు హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఆప్టిక్ నర్వ్‌పై ఒత్తిడి పెరిగితే ఏం జరుగుతుంది?
మెనింజియోమా అనే ట్యూమర్ ఆప్టిక్ నర్వ్ లేదా పిట్యూటరీ గ్రంథి సమీపంలో పెరిగితే కళ్ల నుంచి మెదడుకు వెళ్లే దృష్టి మార్గంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో చూపు మసకబారడం, పక్క దృష్టి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఆప్టిక్ పాత్‌వే గ్లియోమా అనే ట్యూమర్ నేరుగా కళ్ల నుంచి మెదడుకు సమాచారాన్ని పంపే నరాలపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల క్రమంగా కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంటుంది.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని కలవండి
కంటి చూపులో అకస్మాత్తుగా మార్పులు రావడం, డబుల్ విజన్, తరచూ తీవ్రమైన తలనొప్పి, చూపు క్రమంగా తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభిస్తే చూపును కాపాడటంతో పాటు తీవ్రమైన సమస్యలను కూడా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.
గమనిక: కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉందని అర్థం కాదు. అయితే లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే లేదా తీవ్రమైతే తప్పనిసరిగా కంటి వైద్యుడు లేదా న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.




