జ్వరం వస్తే స్నానం చేయొచ్చా? ఈ తప్పు మాత్రం చేయకండి!
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా? చల్లని నీటితో స్నానం ఎందుకు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
fever care tips
వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జ్వరం రావడం సాధారణమే. అయితే జ్వరం అనేది ప్రత్యేకంగా ఒక వ్యాధి కాకుండా.. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు కనిపించే సహజ ప్రతిచర్యగా వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా విశ్రాంతి, తగినంత నీరు తీసుకోవడం ద్వారా జ్వరం నుంచి కోలుకోవచ్చు. అయితే ఈ సమయంలో చేసే కొన్ని పొరపాట్లు రికవరీని ఆలస్యం చేసే అవకాశం ఉంది.
జ్వరం సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి
జ్వరం ఉన్నప్పుడు చెమట పట్టడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో నీరు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో నీరసం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే తరచూ నీరు తాగడంతో పాటు ORS, కొబ్బరి నీళ్లు, క్లియర్ సూప్స్, తాజా పండ్ల రసాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తేలికపాటి ఆహారం తీసుకోవాలి
జ్వరం వచ్చినప్పుడు శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఈ సమయంలో జీర్ణక్రియ కూడా నెమ్మదించే అవకాశం ఉంటుంది. కాబట్టి వేయించిన పదార్థాలు, ఎక్కువ మసాలా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. అన్నం, ఖిచ్డీ, పప్పులు, గంజి, టోస్ట్ వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది.
జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా?
జ్వరం వచ్చినప్పుడు చల్లటి నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని చాలామంది భావిస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు చెబుతున్నారు. ఐస్ వాటర్ లేదా చాలా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల వణుకు రావచ్చు. దీంతో శరీర అంతర్గత ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అందువల్ల జ్వరం ఉన్న సమయంలో అవసరమైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా వెచ్చని నీటితో స్పాంజ్ బాత్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.
కేవలం మందులపైనే ఆధారపడొద్దు
జ్వరం తగ్గేందుకు మందులు తీసుకోవడంతో పాటు శరీరానికి తగిన విశ్రాంతి, పోషకాహారం, పరిశుభ్రత కూడా అవసరం. త్వరగా ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో అనవసరమైన ఇంటి చిట్కాలు పాటించకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
స్వల్పమైన జ్వరాన్ని ఇంట్లో విశ్రాంతి, తగినంత ద్రవాలు తీసుకోవడం ద్వారా చూసుకోవచ్చు. అయితే జ్వరం ఎక్కువగా ఉండటం, తగ్గకుండా కొనసాగడం, తీవ్రమైన ఒంటినొప్పులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.




