Health: బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతున్నారా? ఇది తెలుసుకోండి..!

Health: హై బీపీ ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా టాబ్లెట్స్ వేసుకోవాలని వైద్యులు సూచన. డోస్ మిస్ అయితే 2 డోసులు ఒకేసారి వద్దు అని చెబుతున్నారు.

Ravi
By Ravi
Published on: 4 Nov 2026 6:14 PM IST
Health
X

Health: బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతున్నారా? ఇది తెలుసుకోండి..!

Health: హై బీపీ ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా టాబ్లెట్స్ వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్క రోజు డోస్ మిస్ అయినా బీపీ పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 'మెడిసిన్ వేసుకోవడం తరచుగా మిస్ చేస్తుంటే రక్తనాళాలు దెబ్బతిని గుండె, బ్రెయిన్, కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మర్చిపోయామని ఒకేసారి 2 డోసులు వేసుకోవద్దు. తలనొప్పి లేదా తల తిరగడం వంటి లక్షణాలను అశ్రద్ధ చేయవద్దు' అని వివరిస్తున్నారు.

ఎప్పుడో ఒకసారి ఒక డోస్ మిస్ అయితే పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ రోజు బీపీ తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో బీపీ చాలా ఎక్కువగా ఉన్నవారు, స్ట్రోక్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువ. అదే టాబ్లెట్స్ తరచూ మిస్ అవుతుంటే బీపీ నియంత్రణ తప్పి, గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ దెబ్బతినే ముప్పు పెరుగుతుంది.

డోస్ మిస్ అయినట్లు గుర్తొస్తే వెంటనే టాబ్లెట్ వేసుకోవాలి. అయితే తర్వాతి డోస్ సమయం దగ్గరపడితే మిస్ అయిన డోస్‌ను వదిలేసి, రోజూ వేసుకునే సమయానికే తర్వాతి టాబ్లెట్ వేసుకోవాలి. అంతేకానీ ఒకేసారి 2 డోసులు వేసుకోకూడదు. ఇలా చేస్తే బీపీ ఒక్కసారిగా పడిపోయి తల తిరగడం, కళ్లు తిరగడం, స్పృహ తప్పి పడిపోవడం లాంటివి జరగవచ్చు.

మందును బట్టి ప్రభావం మారుతుంది. తక్కువ సమయం పనిచేసే మందులు మిస్ అయితే కొన్ని గంటల్లోనే బీపీ మళ్లీ పెరగవచ్చు. ఎక్కువ సమయం పనిచేసే మందుల్లో ఒక డోస్ మిస్ అయినా కొంత రక్షణ ఉంటుంది. బీటా బ్లాకర్స్, క్లోనిడిన్ లాంటి మందులను ఒక్కసారిగా ఆపేస్తే బీపీ, గుండె వేగం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంటుంది. బీపీ రీడింగ్ సాధారణంగా వస్తోందని మందు ఆపకూడదు. ఆ రీడింగ్ మందు పనిచేస్తోందనడానికి సంకేతం.

చాలామంది మందులు సరిగా వాడటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలో 65 ఏళ్లు పైబడిన 1.85 కోట్ల మెడికేర్ సభ్యులపై చేసిన అధ్యయనంలో, నాలుగో వంతు కంటే ఎక్కువ మంది బీపీ మందులను సూచించిన విధంగా వాడటం లేదని తేలింది. ఖర్చు, ఎలా వాడాలో తెలియకపోవడం, దుష్ప్రభావాలు దీనికి కారణాలుగా చెప్పారు.

డోస్ మర్చిపోకుండా ఉండాలంటే ఫోన్‌లో అలారం పెట్టుకోవడం, టాబ్లెట్స్ కనిపించే చోట ఉంచడం, పిల్ ఆర్గనైజర్ వాడటం మంచిది. మందులు అయిపోకముందే రీఫిల్ కోసం రిమైండర్ పెట్టుకోవాలి. డోస్ మిస్ అయిన తర్వాత ఇంట్లో బీపీ చూసుకోవాలి. రీడింగ్ బాగా ఎక్కువగా ఉన్నా, వరుసగా చాలా డోసులు మిస్ అయినా, తలనొప్పి లేదా తల తిరగడం వంటివి కొనసాగినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.