Health Tips: రాత్రి పడుకునే ముందు ఈ చిన్న అలవాట్లు పాటిస్తే.. ప్రశాంతమైన నిద్ర మీ సొంతం!
Health Tips: రాత్రి పడుకునే ముందు కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే ప్రశాంతమైన నిద్రతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది.
Health Tips: రాత్రి పడుకునే ముందు ఈ చిన్న అలవాట్లు పాటిస్తే.. ప్రశాంతమైన నిద్ర మీ సొంతం!
Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా చాలామందిలో నిద్రలేమి సమస్య తీవ్రమవుతోంది. రాత్రి సమయాల్లో సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. రోజంతా కష్టపడి పని చేసిన తర్వాత రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర ఉండటం ఎంతో అవసరం. అయితే పడుకునే ముందు కొన్ని చిన్నచిన్న పద్ధతులు పాటిస్తే హాయిగా నిద్రపోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన నిద్ర కోసం కొన్ని మంచి అలవాట్లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
మొదటిగా రాత్రి పూట భోజనం చేసే సమయానికి పడుకునే సమయానికి మధ్య కనీసం రెండు నుంచి మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. పడుకునే రెండు లేదా మూడు గంటల ముందే భోజనం పూర్తి చేస్తే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దీనివల్ల రాత్రివేళ ఎసిడిటీ లేదా కడుపులో మంట వంటి సమస్యలు ఉండవు. అలాగే రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించి నిద్రకు భంగం కలుగుతుంది. సమయానికి భోజనం చేయడం ద్వారా శరీరం విశ్రాంతి స్థితికి చేరుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది.
రెండవదిగా రాత్రి పడుకునే ముందు వేడినీటితో స్నానం చేయడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేడినీటితో స్నానం చేయడం వల్ల ఒళ్లంతా రిలాక్స్ అవుతుంది. కండరాలు శాంతించి శరీరంలో అలసట పూర్తిగా తొలగిపోతుంది. దీంతో హాయిగా, ప్రశాంతంగా నిద్రపడుతుంది. రోజంతా ఉన్న టెన్షన్స్ అన్నీ పక్కనపెట్టి మైండ్‌ను రిలాక్స్ చేసుకోవాలి. సానుకూల ఆలోచనలతో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్నపాటి ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు కూడా చేయవచ్చు.
చివరిగా పడుకునే ముందు కనీసం ముప్పై నిమిషాల పాటు టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి స్క్రీన్లకు దూరంగా ఉండాలి. మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి డిజిటల్ డిటాక్స్ పాటించడం చాలా ముఖ్యం. స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతి మెదడుపై ప్రభావం చూపి నిద్రను దూరం చేస్తుంది. చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఇబ్బందులను నివారించవచ్చు. ప్రశాంతమైన నిద్ర ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ప్రధాన ఆధారం కావడంతో ఈ అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలి.




