Gym Tips: కొత్తగా జిమ్‌ జాయిన్ అవుతున్నారా.! ఇలా కచ్చితంగా చేయాల్సిందే!

Gym Tips: కొత్తగా జిమ్‌లో చేరే ముందు ఇంట్లోనే కనీసం వారం రోజుల పాటు వ్యాయామం అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Ravi
By Ravi
Published on: 6 Sept 2026 5:00 PM IST
Gym Tips
X

Gym Tips: కొత్తగా జిమ్‌ జాయిన్ అవుతున్నారా.! ఇలా కచ్చితంగా చేయాల్సిందే!

Gym Tips: ఆధునిక జీవనశైలిలో ఫిట్‌నెస్ సాధించాలనే ఉత్సాహంతో చాలామంది జిమ్‌లో చేరుతుంటారు. ఆరోగ్యంగా ఉండాలని, కండరాలు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. భారీగా ఫీజులు చెల్లించి వార్షిక సభ్యత్వం తీసుకుంటారు. అయితే చేరిన కొన్ని రోజులకే ఆ ఉత్సాహం పూర్తిగా తగ్గిపోతుంది. ఉదయం త్వరగా నిద్ర లేవలేకపోవడం, ఆఫీసు పనులు, ఇతర వ్యక్తిగత కారణాలతో జిమ్‌కు వెళ్లడం క్రమంగా మానేస్తారు. టైమ్ కుదరకపోవడంతో చాలామంది మధ్యలోనే డ్రాప్ అవుతుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే కొత్తగా జిమ్‌లో అడుగుపెట్టే వారు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు శారీరక దృఢత్వాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు.

జిమ్‌లో చేరడానికి ముందు కనీసం వారం నుంచి పది రోజుల పాటు ఇంట్లోనే స్వల్ప వ్యాయామాలు చేయడం ఎంతో ఉత్తమం. మీరు జిమ్‌కు ఏ సమయంలో వెళ్లాలని అనుకుంటున్నారో కచ్చితంగా అదే సమయానికి ఇంట్లో వర్కౌట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదయం 6 గంటలకు వెళ్లాలని నిర్ణయించుకుంటే, రోజూ అదే సమయానికి నిద్రలేచి కనీసం అరగంట పాటు వాకింగ్ లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. ఇలా క్రమం తప్పకుండా పది రోజుల పాటు కంటిన్యూగా చేయగలిగితేనే జిమ్‌లో జాయిన్ అవ్వడం బెటర్. ఇంట్లోనే ఆ సమయానికి లేవలేక, వ్యాయామం చేయలేకపోతే జిమ్‌కు కూడా రెగ్యులర్‌గా వెళ్లలేరని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ చిన్నపాటి పరీక్ష ద్వారా మీలో ఉన్న క్రమశిక్షణ, ఫిట్‌నెస్ పట్ల ఉన్న శ్రద్ధ పూర్తిగా తెలుస్తుంది.

ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా నేరుగా వెళ్లి జిమ్‌లో చేరితే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నగరాల్లో జిమ్ ఫీజులు భారీగా ఉంటున్నాయి. సాధారణ జిమ్‌లలో సైతం నెలవారీ ఫీజులు రూ. 5 వేలు నుంచి వార్షిక ప్యాకేజీలు రూ. 50 వేలు వరకు ఉంటున్నాయి. కేవలం ఉత్సాహంతో జాయిన్ అయి రెండు మూడు రోజుల్లోనే మానేస్తే ఆ డబ్బు అంతా వృథా అవుతుంది. అలాగే ముందస్తు అలవాటు లేకుండా నేరుగా భారీ బరువులు ఎత్తితే తీవ్రమైన కండరాల నొప్పులు వస్తాయి. ఈ బాడీ పెయిన్స్ భరించలేక చాలామంది వ్యాయామానికి పూర్తిగా దూరమవుతారు. ఇలాంటి అనవసరపు ఖర్చులు, శారీరక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగా ఇంట్లోనే ప్రిపేర్ అవ్వాలి. శరీరాన్ని వర్కౌట్‌కు అలవాటు చేసిన తర్వాతే ప్రొఫెషనల్ శిక్షణ తీసుకోవాలి.

జిమ్‌లో చేరిన తర్వాత కూడా నేరుగా కఠినమైన వర్కౌట్స్ చేయకూడదు. ముందుగా ట్రెడ్ మిల్ రన్నింగ్, సైక్లింగ్ లాంటి కార్డియో వ్యాయామాలు మాత్రమే చేయాలి. ఏకబిగిన బరువులు ఎత్తకుండా ట్రైనర్ పర్యవేక్షణలో మాత్రమే పరికరాలు వాడాలి. జిమ్ మెంబర్‌షిప్ కోసం రూ. 10 వేలు లేదా రూ. 20 వేలు చెల్లించే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా తగిన పోషకాహారం తీసుకుంటేనే సరైన ఫలితాలు వస్తాయి. ఆహార నియమాలు పాటించకుండా ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. జిమ్‌కు వెళ్లడం ఒక దినచర్యగా మార్చుకోవాలి తప్ప, తాత్కాలిక ఆకర్షణగా భావించకూడదు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే ఫిట్‌నెస్ జర్నీలో విజయవంతం అవుతారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story