Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటున్నారా? ఈ ప్రమాదాలు తెలుసుకోండి
Hair Transplant: ప్రస్తుత కాలంలో చాలా మందిలో జుట్టు రాలిపోవడం అనేది పెద్ద ఆందోళనకర విషయంగా మారుతోంది.
Hair Transplant
Hair Transplant: ప్రస్తుత కాలంలో చాలా మందిలో జుట్టు రాలిపోవడం అనేది పెద్ద ఆందోళనకర విషయంగా మారుతోంది. ముఖ్యంగా తల ముందు భాగంలో జుట్టు పల్చబడటం లేదా బట్టతల రావడం వల్ల చాలామంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇది ఒక రకమైన సర్జికల్ ప్రక్రియ. ఈ పద్ధతిలో తలలో ఎక్కడైతే జుట్టు ఒత్తుగా ఉంటుందో ఆ ప్రాంతం నుంచి వెంట్రుకల వేర్లను సేకరించి, జుట్టు తక్కువగా ఉన్న భాగంలో అమరుస్తారు. సాధారణంగా ఈ ప్రాసెస్ సురక్షితమైనదిగా భావించినప్పటికీ, కొన్నిసార్లు కొన్ని రకాల దుష్ప్రభావాలు ఎదురుకావాల్సి వస్తుంది.
సర్జరీ తర్వాత నొప్పి, వాపు
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ పూర్తి చేసిన తర్వాత తల చర్మంలో స్వల్పంగా నొప్పి, లాగడం అలాగే వాపు కనిపించడం సర్వసాధారణం. కొందరిలో నుదురు భాగం కళ్ళ చుట్టూ కొన్ని రోజుల పాటు వాపు స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ సమస్యలు స్వల్పకాలికంగా ఉండి క్రమక్రమంగా తగ్గిపోతాయి. అయితే సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం
ఇది ఒక రకమైన ఆపరేషన్ కాబట్టి ఇన్ఫెక్షన్ సోకే ముప్పు పూర్తిగా తొలగిపోదు. ఒకవేళ సర్జరీ సమయంలో లేదా ఆ తర్వాత పరిశుభ్రత పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. వైద్యులు సూచించిన తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ విపరీతమైన వాపు, చీము పట్టడం, తీవ్రమైన నొప్పి లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
షాక్ లాస్, ఇతర చర్మ సమస్యలు
ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాక కొందరిలో కొత్త జుట్టుతో పాటు చుట్టుపక్కల ఉన్న వెంట్రుకలు కూడా రాలిపోయే పరిస్థితి ఎదురవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో షాక్ లాస్ అంటారు. అయితే ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. కొంత కాలం తర్వాత మళ్ళీ కొత్త జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది. కొత్త కుదుళ్లు పూర్తిగా ఎదగడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో తలలో దురద, తిమ్మిరి లేదా మొద్దుబారినట్లు అనిపించడం వంటివి జరుగుతుంటాయి.
ఎలాంటి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలన్నా కేవలం తక్కువ ఖర్చు చూసి క్లినిక్‌ను ఎంచుకోవడం సరికాదు. వైద్యుడి అనుభవం, ఉపయోగించే టెక్నాలజీ, క్లినిక్ పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. సాధారణంగా ఇరవై మూడు లేదా ఇరవై ఐదు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్నవారికి ఈ సర్జరీ చేయించుకోవద్దని సలహా ఇస్తారు. తలలో 70 నుంచి 100 శాతం వరకు జుట్టు రాలిపోయినప్పుడు మాత్రమే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడం సరైన నిర్ణయమవుతుంది.




