Health: ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఆ సమస్యే కావొచ్చు.
Health: కొందరిలో ఉదయం లేవగానే కళ్ల చుట్టూ వాపు కనిపిస్తుంది. అయితే రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, అలసట, తప్పు నిద్ర స్థితి కారణంగా వచ్చిందని భావిస్తారు.
Health: ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఆ సమస్యే కావొచ్చు.
Health: కొందరిలో ఉదయం లేవగానే కళ్ల చుట్టూ వాపు కనిపిస్తుంది. అయితే రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, అలసట, తప్పు నిద్ర స్థితి కారణంగా వచ్చిందని భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కళ్ల చుట్టూ వాపు కిడ్నీ సమస్యకు సంకేతమా.?
మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయడం, మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపించడం వంటి కీలక పనులు చేస్తాయి. కిడ్నీలలోని ఫిల్టరింగ్ యూనిట్లను నెఫ్రాన్‌లు అంటారు. కిడ్నీలు బలహీనపడితే ఈ నెఫ్రాన్‌లు సరిగా పని చేయవు. దీంతో రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్ (ప్రత్యేకంగా ఆల్బ్యూమిన్) మూత్రంలోకి వెళ్లడం ప్రారంభమవుతుంది. ఈ ప్రోటీన్ రక్తంలో ద్రవాన్ని నిలుపుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది తగ్గిపోతే శరీరంలోని ద్రవం టిష్యూల్లో చేరి కళ్ల చుట్టూ, ముఖంపై వాపు కనిపిస్తుంది.
ఉదయం సమయంలోనే వాపు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది?
నిద్రపోతున్నప్పుడు మనం ఎక్కువసేపు ఒకే స్థితిలో పడుకుంటాం. ఆ సమయంలో గ్రావిటీ ప్రభావం వల్ల శరీరంలోని ద్రవం కళ్ల చుట్టూ టిష్యూల్లో చేరుతుంది. అందుకే ఉదయం లేవగానే కళ్ల కింద వాపు ఎక్కువగా కనిపిస్తుంది. రోజు గడిచేకొద్దీ మనం నడవడం, నిలబడడం వల్ల ఆ ద్రవం కాళ్లు, మడమల వైపు చేరుతుంది. దీంతో కళ్ల వాపు కొంత తగ్గినట్లు కనిపిస్తుంది.
కళ్ల వాపునకు ఈ కారణాలు కూడా ఉంటాయి
ప్రతి సందర్భంలో కళ్ల వాపు కిడ్నీ సమస్యే అని భావించాల్సిన అవసరం లేదు. కొన్ని తాత్కాలిక కారణాల వల్ల కూడా ఇది కనిపించవచ్చు. తగినంత నిద్ర లేకపోవడం, అలర్జీలు, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం,
డీహైడ్రేషన్, ఎక్కువగా ఏడవడం లేదా అలసట వంటి కారణాలు కూడా కావొచ్చు. ఇలాంటి కారణాల వల్ల వచ్చిన వాపు సాధారణంగా కొద్ది గంటల్లో తగ్గిపోతుంది. కానీ రోజూ అలాగే ఉంటే మాత్రం జాగ్రత్త అవసరం.
కిడ్నీ సమస్యను సూచించే ఇతర లక్షణాలు
కళ్ల చుట్టూ వాపుతో పాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మూత్రం ఫోమ్ లేదా నురుగు లాగా కనిపించడం. కాళ్లు, మడమల దగ్గర వాపు, తరచూ అలసట, బలహీనత, మూత్ర పరిమాణంలో మార్పులు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం. వంటివి కిడ్నీ పనితీరు తగ్గుతున్న సంకేతాలు కావచ్చు.
వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి
కొంతమందికి కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, హై బ్లడ్ షుగర్ ఉన్నవారు, కుటుంబంలో కిడ్నీ వ్యాధి చరిత్ర ఉన్నవారు, హై బీపీ ఉన్నవారు ముఖం వాపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు గుండె, రక్తపోటు, షుగర్ నియంత్రణ వంటి అనేక శరీర వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ప్రారంభ లక్షణాలను గుర్తించి ముందుగానే పరీక్షలు చేయించుకుంటే పెద్ద సమస్యలను నివారించవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఇవి వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. ఆరోగ్యం విషయంలో వైద్యులను నేరుగా సంప్రదించడమే మంచిది.




