Health: మెట్లు ఎక్కితే ఆయాసంగా ఉంటోందా.? అస‌లు స‌మ‌స్య ఏంటో తెలుసా.?

Health: మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి వేగంగా తీసుకోవడం చాలామందికి సాధారణంగా ఎదుర‌య్యే స‌మ‌స్యే. ఈ సంద‌ర్భాల్లో శరీరానికి అకస్మాత్తుగా ఎక్కువ ఆక్సిజన్ అవసరం కావడంతో శ్వాస వేగం పెరుగుతుంది.

Mokshith
Published on: 5 Sept 2026 5:39 PM IST
Health
X

Health: మెట్లు ఎక్కితే ఆయాసంగా ఉంటోందా.? అస‌లు స‌మ‌స్య ఏంటో తెలుసా.?

Health: మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి వేగంగా తీసుకోవడం చాలామందికి సాధారణంగా ఎదుర‌య్యే స‌మ‌స్యే. ఈ సంద‌ర్భాల్లో శరీరానికి అకస్మాత్తుగా ఎక్కువ ఆక్సిజన్ అవసరం కావడంతో శ్వాస వేగం పెరుగుతుంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాధారణ స్థితికి వస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే కొద్దిపాటి మెట్లు ఎక్కగానే తీవ్రంగా ఊపిరి ఆడకపోవడం, తరచూ ఈ సమస్య రావడం వంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకూడదు.

ఫిట్‌నెస్ లోపం వల్ల కూడా ఆయాసం

రోజూ నడక, పరుగులు లేదా ఇతర శారీరక వ్యాయామాలు చేయని వారి శారీరక సామర్థ్యం తగ్గిపోవచ్చు. ఇలాంటి సమయంలో మెట్లు ఎక్కడం వంటి పని శరీరంపై ఒక్కసారిగా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా రక్తాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో కండరాలకు కూడా ఎక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది. శరీరం ఈ మార్పు అలవాటు లేకపోతే త్వరగా శ్వాస తీసుకోవడం, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. క్రమంగా వ్యాయామం చేయడం ద్వారా శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

అధిక బరువు కూడా ఒక కారణం కావచ్చు

శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు నడవడం, పరుగెత్తడం లేదా మెట్లు ఎక్కడం వంటి పనులకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ అవసరం కూడా పెరుగుతుంది. ఫలితంగా సాధారణ వ్యక్తులతో పోలిస్తే త్వరగా ఊపిరి ఆడకపోవచ్చు. ఇలాంటి వారు ఒక్కసారిగా కఠినమైన వ్యాయామాలు చేయకుండా రోజూ కొద్దిసేపు నడకతో ప్రారంభించడం మంచిది. క్రమంగా శారీరక శ్రమను పెంచుతూ, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా బరువు, ఫిట్‌నెస్ రెండింటినీ నియంత్రించుకోవచ్చు.

రక్తహీనత వంటి సమస్యల వల్ల కూడా..

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే రక్తం ద్వారా శరీర భాగాలకు ఆక్సిజన్ చేరే సామర్థ్యం ప్రభావితం కావచ్చు. దీనిని సాధారణంగా రక్తహీనత లేదా ఎనీమియా అంటారు. మెట్లు ఎక్కడం వంటి శారీరక శ్రమ సమయంలో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపించవచ్చు. ఊపిరి ఆడకపోవడంతో పాటు తరచూ అలసట, బలహీనత, తల తిరగడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అవసరమైతే రక్త పరీక్షల ద్వారా అసలు కారణాన్ని తెలుసుకోవచ్చు.

ఎప్పుడు జాగ్రత్త పడాలి?

అప్పుడప్పుడు వేగంగా మెట్లు ఎక్కినప్పుడు ఊపిరి పీల్చుకోవడం సాధారణమే కావచ్చు. కానీ కొద్దిపాటి శ్రమకే తీవ్రంగా ఊపిరి ఆడకపోవడం, ఈ సమస్య తరచూ రావడం లేదా ఛాతీలో నొప్పి, తల తిరగడం, తీవ్రమైన అలసట వంటి ఇతర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. రోజూ మీ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా క్రమంగా ఫిట్‌నెస్‌ను పెంచుకోవచ్చు. మెట్లు ఎక్కడం కూడా మంచి శారీరక వ్యాయామమే. అయితే మొదట నెమ్మదిగా ప్రారంభించి, శరీరం అలవాటు పడే కొద్దీ శ్రమను పెంచాలి.

గమనిక: మెట్లు ఎక్కిన ప్రతిసారీ తీవ్రంగా ఊపిరి ఆడకపోతే దానిని కేవలం ఫిట్‌నెస్ లోపంగా భావించకండి. రక్తహీనత, శ్వాసకోశ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. సమస్య తరచూ వస్తుంటే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story