Water Cans: వాటర్ క్యాన్ మూత తెరిచాక ఎన్ని రోజుల్లో నీళ్లు తాగేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Water Cans: ఇళ్లలో వాడే 20 లీటర్ల వాటర్ క్యాన్లను దీర్ఘకాలం వాడుతుంటే అనారోగ్యాలు తప్పవు. వాటర్ క్యాన్లను ఎలా శుభ్రం చేయాలి, ఎన్ని రోజుల్లో మార్చాలనే పూర్తి వివరాలు ఇవే.
Water Cans: వాటర్ క్యాన్ మూత తెరిచాక ఎన్ని రోజుల్లో నీళ్లు తాగేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Water Cans: ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ రోజూ ఉపయోగించే 20 లీటర్ల నీటి క్యాన్లను (బబుల్స్) చాలా మంది ఏళ్ల తరబడి వాడుతుంటారు. వాటిని సరిగా శుభ్రం చేయకుండానే మళ్లీ మళ్లీ నీళ్లు నింపి ఇస్తుంటారు. అయితే, ఈ ప్లాస్టిక్ క్యాన్లను సరిగ్గా ఎలా వాడాలి? క్యాన్ తెరిచిన తర్వాత నీటిని ఎన్ని రోజుల్లో తాగాలి? ప్లాస్టిక్ క్యాన్‌ను ఎన్నిసార్లు రీఫిల్ చేసి వాడొచ్చనే దానిపై ఆరోగ్య నిపుణులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నీటి క్యాన్ల వాడకంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:
ఎన్ని రోజుల్లో తాగాలి?: క్యాన్ మూత తెరిచిన తర్వాత కనీసం మూడు నుంచి ఐదు రోజుల్లోపే ఆ నీటిని పూర్తిగా తాగేయాలి.
గీతలు పడితే డేంజర్: క్యాన్లపై గీతలు పడినా, రంగు మసకబారినా, లీక్ అయినా వెంటనే వాటిని మార్చేయాలి. క్యాన్ లోపల గీతలు పడితే బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది.
ఎండలో అస్సలు ఉంచవద్దు: వాటర్ క్యాన్లను ఎండలో లేదా వేడి వాతావరణంలో ఉంచితే ప్లాస్టిక్‌లోని రసాయనాలు నీటిలో కలుస్తాయి. కాబట్టి కిటికీల పక్కన, ఎండ తగిలే చోట వీటిని పెట్టకూడదు.
వాసన వస్తే తాగొద్దు: క్యాన్‌లోని నీరు తాగేటప్పుడు ఏమాత్రం ప్లాస్టిక్ వాసన వచ్చినా, రుచి మారినా ఆ నీటిని వెంటనే పారబోయాలి.
రసాయనాలకు దూరంగా: వాటర్ క్యాన్లను డిటర్జెంట్లు, ఫినాయిల్, కిరోసిన్ లేదా పెయింట్స్ వంటి రసాయనాలు ఉన్న చోట ఉంచకూడదు. ప్లాస్టిక్ క్యాన్లు ఆ వాసనలను త్వరగా పీల్చుకుంటాయి.
ఎక్కడ పెట్టాలి?: క్యాన్లను నేరుగా సిమెంటు లేదా మట్టి నేలపై పెట్టకుండా, దుమ్ము, కీటకాలు చేరకుండా చెక్క స్టాండ్లు లేదా ప్లాస్టిక్ పీటలపై ఉంచాలి. క్యాన్ మూతకు ఐఎస్‌ఐ మార్క్, ల్యాబ్ టెస్ట్ నంబర్ ఉన్నాయో లేదో చూసుకోవాలి.
క్యాన్‌ను ఎప్పుడు మార్చాలి? (జీవితకాలం):
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒకే క్యాన్‌ను నిరంతరం రీఫిల్ చేస్తూ ఉంటే మూడు నుంచి నాలుగు నెలల్లో (గరిష్టంగా 6 నెలలు దాటకుండా) దాని ప్లాస్టిక్ నాణ్యత తగ్గిపోతుంది. క్యాన్ తెల్లగా లేదా బ్లూగా కాకుండా మసకబారినా, పచ్చగా/నల్లగా నాచుపట్టినా అస్సలు వాడకూడదు.
క్యాన్లను శుభ్రం చేసే విధానం:
క్యాన్ లోపల శుభ్రం చేయడానికి స్టీల్ పీచులు లేదా గరుకైన బ్రష్‌లు అసలు వాడకూడదు. దీనివల్ల ప్లాస్టిక్‌పై గీతలు పడి బ్యాక్టీరియా చేరుతుంది.
బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటితో కలిపి క్యాన్ లోపల పోసి, అరగంటపాటు ఉంచి బాగా కుదిపిన తర్వాత మంచినీళ్లతో మూడుసార్లు శుభ్రం చేయాలి.
కడిగిన క్యాన్‌ను ఎండలో పెట్టకుండా, నీడలోనే బోర్లించి ఆరబెట్టాలి. నీరు వంచుకునే ట్యాప్ లేదా వాటర్ డిస్పెన్సర్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి వేడి నీటితో శుభ్రం చేయాలి.




