Heart Health: మీ గుండె ఆరోగ్యంగానే ఉందా.? ఇంట్లోనే ఉండి ఇలా తెలుసుకోండి.
Heart Health: గుండె మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో ఒకటి. ఇది నిరంతరం రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తూ ఉంటుంది.
Heart Health: మీ గుండె ఆరోగ్యంగానే ఉందా.? ఇంట్లోనే ఉండి ఇలా తెలుసుకోండి.
Heart Health: గుండె మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో ఒకటి. ఇది నిరంతరం రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తూ ఉంటుంది. సాధారణంగా గుండెకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఛాతీ నొప్పి, ఆయాసం వంటి లక్షణాల గురించి మాత్రమే మనకు గుర్తొస్తుంది. అయితే కొన్ని సాధారణ శారీరక మార్పులను గమనించడం ద్వారా గుండె పనితీరు గురించి ప్రాథమిక అవగాహన పొందవచ్చు. ఆ మార్పులు ఏంటంటే.?
విశ్రాంతి సమయంలో పల్స్ ఎలా ఉంది?
మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు లేదా కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మీ పల్స్ రేటును గమనించవచ్చు. సాధారణంగా పెద్దవారిలో విశ్రాంతి సమయంలో నిమిషానికి 60 నుంచి 100 హార్ట్బీట్స్ మధ్య ఉండటం సాధారణ పరిధిగా పరిగణిస్తారు. అయితే వయసు, శారీరక దారుఢ్యం, వ్యాయామం చేసే అలవాటు, మందులు వంటి అనేక అంశాలపై పల్స్ రేటు ఆధారపడి ఉంటుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేసే కొంతమందిలో విశ్రాంతి సమయంలో హార్ట్ రేట్ 60 కంటే తక్కువగా ఉండవచ్చు. అది ఒక్కటే ఆరోగ్య సమస్యకు సంకేతం అని చెప్పలేం. అదే సమయంలో పల్స్ చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉండటంతో పాటు తల తిరగడం, బలహీనంగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఒక్కసారి చూసిన రీడింగ్ కంటే, వివిధ సమయాల్లో తీసుకున్న రీడింగుల్లో కనిపించే మార్పులను గమనించడం ఉపయోగకరం.
బీపీ, నడకలో శరీర స్పందనను గమనించండి
రక్తపోటు కూడా గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో ముఖ్యమైన సూచిక. సాధారణంగా 120/80 mmHgను ఆరోగ్యకరమైన రక్తపోటుకు ఒక ప్రామాణిక స్థాయిగా చెబుతారు. అయితే ఒక్కసారి వచ్చిన బీపీ రీడింగ్తోనే ఎవరి ఆరోగ్యాన్ని నిర్ణయించలేం. క్రమం తప్పకుండా బీపీని కొలుస్తూ మార్పులను గమనించడం ముఖ్యం.
అలాగే రోజువారీ శారీరక పనులు చేస్తున్నప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో కూడా గమనించాలి. సాధారణ వేగంతో నడవడం, మెట్లు ఎక్కడం వంటి పనుల్లో వయసుకు తగ్గట్టుగా శ్వాస తీసుకోగలగడం మంచి సామర్థ్యానికి సూచన కావచ్చు. అయితే మునుపటి కంటే ఇప్పుడు కొద్దిపాటి పనికే ఎక్కువగా ఆయాసం వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఛాతీలో నొప్పి లేదా బిగుతు, తల తిరగడంఉంటే వైద్య పరీక్ష అవసరం.
వ్యాయామం తర్వాత ఎంత త్వరగా కోలుకుంటున్నారు?
వర్కౌట్, వేగంగా నడక లేదా ఇతర శారీరక శ్రమ చేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం సహజమే. ఎందుకంటే కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం కావడంతో గుండె వేగంగా రక్తాన్ని పంప్ చేస్తుంది. శారీరక శ్రమ ఆపిన తర్వాత హార్ట్ రేట్ క్రమంగా తగ్గుతూ విశ్రాంతి స్థాయికి చేరడం శరీరం రికవరీ అవుతున్న తీరును తెలియజేస్తుంది.
అయితే ప్రతి ఒక్కరికీ రికవరీ వేగం ఒకేలా ఉండదు. వయసు, ఫిట్నెస్, వ్యాయామ తీవ్రత, నిద్ర, ఒత్తిడి, కొన్ని మందులు వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఇంట్లో పల్స్ను గమనించడం ఉపయోగకరమైన సమాచారాన్ని ఇవ్వొచ్చు కానీ దాని ఆధారంగా గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకోలేం. అలాగే కాళ్లు, చీలమండలు లేదా పాదాల్లో తరచుగా వాపు కనిపించడం, రోజువారీ పనుల్లో గతంతో పోలిస్తే ఎక్కువగా అలసట రావడం వంటి మార్పులు కనిపిస్తే కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఈ సంకేతాలు ఉన్నా వైద్య పరీక్షలు అవసరమే
పల్స్ సాధారణంగా ఉండటం, బీపీ అదుపులో ఉండటం, నడిచేటప్పుడు ఇబ్బంది లేకపోవడం వంటి విషయాలు సానుకూల సంకేతాలే. కానీ ఇవి మాత్రమే గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి సరిపోవు. కొన్నిసార్లు గుండెకు సంబంధించిన సమస్యలు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే ఉండవచ్చు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం, పొగతాగడం మానేయడం, బీపీ, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం ఇందులో ముఖ్యమైనవి. ఛాతీ నొప్పి లేదా బిగుతు, తీవ్రమైన ఆయాసం, అకస్మాత్తుగా చెమటలు పట్టడం, మూర్ఛ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.
ముఖ్య గమనిక: ఇంట్లో పల్స్, బీపీ వంటి వాటిని గమనించడం ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడానికి మాత్రమే. వీటి ఆధారంగా గుండె జబ్బు లేదని నిర్ధారించుకోకూడదు. మీకు ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉంటే లేదా కొత్తగా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.




