AC Installation Tips: ఏసీ ఇన్‌స్టాలేషన్‌లో ఈ చిన్న తప్పు చేస్తున్నారా.. భారీ ప్రమాదంలో పడే ఛాన్స్.. అదేంటంటే?
AC Installation Tips: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేడిని తట్టుకోలేక చాలామంది ఏసీలు కొనేస్తున్నారు. ఈ క్రమంలో ఏసీ ఫిట్టింగ్ సమయంలో చేసే చిన్న తప్పు ఇంటికే పెద్ద ముప్పు తేవచ్చు. అందేటో ఓసారి చూద్దాం..
AC Installation Tips
AC Installation Tips: ప్రస్తుతం కొత్త ఇల్లు కట్టుకునే వారు లేదా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకునే వారు ఇంటి గదులు చూడటానికి నీట్‌గా ఉండాలని ఏసీ కాపర్ పైపులను, డ్రైన్ లైన్లను గోడల లోపల (కన్సీల్డ్) ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ పద్ధతి తాత్కాలికంగా అందాన్నిచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. గోడల లోపల ఉండే పైపులలో ఏదైనా లీకేజీ ఏర్పడినా లేదా బ్లాక్ అయినా వాటిని గుర్తించడం, సరిచేయడం అత్యంత కష్టతరమైన పని.
గోడలు బద్దలు కొట్టక తప్పదు..!
ఒకవేళ గోడ లోపల ఉన్న పైపు పాడైతే, ఆ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత గోడను పూర్తిగా పగులగొట్టాల్సి ఉంటుంది. దీనివల్ల కేవలం ఏసీ రిపేర్ ఖర్చే కాకుండా, గోడను మళ్ళీ నిర్మించడం, పుట్టీ వేయడం, పెయింటింగ్ వంటి అదనపు ఖర్చులు తోడవుతాయి. ఇది ఇంటి యజమానులకు ఆర్థికంగా భారం కావడమే కాకుండా, ఇంట్లో చెత్తాచెదారం పెరిగి మానసిక అశాంతికి గురిచేస్తుంది. నీటి లీకేజీ వల్ల గోడలకు తేమ చేరి పెయింట్ ఊడిపోవడం, బ్యాక్టీరియా చేరడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
ఆర్కిటెక్ట్ సూచిస్తున్న సులువైన పరిష్కారం..
ఈ సమస్యకు పరిష్కారంగా పైపులను గోడల లోపల పెట్టకుండా, ఒక 'పెల్మెట్' లేదా ప్రత్యేకమైన బాక్సును తయారు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని పైకప్పు (సీలింగ్) కింద ఏర్పాటు చేయడం వల్ల పైపులన్నీ లోపల దాగి ఉంటాయి, బయటకు కనిపించవు.
నిర్మాణం: దీని కోసం 19 మి.మీ ప్లైవుడ్ ఉపయోగించడం ఉత్తమం.
కొలతలు: దీని ఎత్తు సుమారు 18 నుంచి 19 అంగుళాలు, లోతు 6 అంగుళాల వరకు ఉండాలి. డబుల్ కర్టెన్లు వాడే వారైతే 8 అంగుళాల లోతు ఉంచుకోవచ్చు.
ఫినిషింగ్: పైపులన్నీ ఈ బాక్సు గుండా వెళ్లేలా చూసి, ముందు భాగంలో జిప్సం బోర్డుతో మూసివేసి, పుట్టీ, పెయింట్ వేస్తే అది గోడలో భాగంలాగే కనిపిస్తుంది.
ఈ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు..
ఈ విధానం వల్ల భవిష్యత్తులో ఏసీ పైపులలో సమస్య వచ్చినా, కేవలం ఆ బాక్సును తెరిచి సులభంగా రిపేర్ చేసుకోవచ్చు. గోడలు పగులగొట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు. దీనివల్ల సమయం, డబ్బు, శ్రమ ఆదా అవుతాయి. ఇంటి ఆధునిక లుక్ కూడా మారదు.
సోషల్ మీడియాలో చర్చ..
ఈ అంశంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు తమ ఇళ్లలో దశాబ్ద కాలంగా గోడల లోపల పైపులు ఉన్నా ఏ సమస్యా రాలేదని అంటుంటే, మరికొందరు మాత్రం పైపుల వద్ద సరైన ఇన్సులేషన్ లేకపోతే బాక్సులో ప్రకంపనలు (వైబ్రేషన్స్) వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, కేవలం ఇంటి అందం మాత్రమే కాకుండా భవిష్యత్తు మెయింటెనెన్స్ దృష్టిలో ఉంచుకోవడం తెలివైన పని అని నిపుణులు నొక్కి చెబుతున్నారు.




