ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత చ‌క్కెర తీసుకోవాలి.? ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పేది ఇదే

Health: ఈ రోజుల్లో చాలా మంది తెలియకుండానే ఎక్కువ మొత్తంలో చక్కెర తీసుకుంటున్నారు.

Mokshith
Published on: 4 July 2026 1:28 PM IST
Health
X

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత చ‌క్కెర తీసుకోవాలి.? ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పేది ఇదే

Health: ఈ రోజుల్లో చాలా మంది తెలియకుండానే ఎక్కువ మొత్తంలో చక్కెర తీసుకుంటున్నారు. అయితే ఎక్కువకాలం ఇలా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రోజువారీ చక్కెర వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలని WHO చెబుతోంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం రోజూ తీసుకునే మొత్తం క్యాలరీల్లో చక్కెర వాటా 10 శాతానికి మించకూడదు. అంటే సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 50 గ్రాములు లేదా దాదాపు 12 టీ స్పూన్ల చక్కెర కంటే ఎక్కువ తీసుకోకూడదు. అయితే ఆరోగ్యం కోసం ఈ పరిమితిని 25 గ్రాములు లేదా సుమారు 6 టీ స్పూన్లకు తగ్గించాలని WHO సూచిస్తోంది. ఈ లెక్కలో టీ, కాఫీలో వేసే చక్కెరతో పాటు కూల్‌డ్రింక్స్, స్వీట్లు, బిస్కెట్లు, ప్యాకెట్ జ్యూస్‌లు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే అదనపు చక్కెర కూడా చేరుతుంది. అయితే పండ్లలో సహజంగా ఉండే చక్కెర, పాలలో ఉండే లాక్టోస్‌ను ఈ లెక్కలో పరిగణించరు. ఎందుకంటే అవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలను కూడా అందిస్తాయి.

చక్కెర తగ్గిస్తే శరీరానికి కలిగే ప్రయోజనాలు

రోజువారీ చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీర బరువును నియంత్రించుకోవడం సులభమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటంతో మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. చర్మంపై మొటిమలు తగ్గడంతో పాటు చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. రోజంతా శక్తి స్థాయిలు నిలకడగా ఉండటంతో అలసట తగ్గుతుంది. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దంతాల్లో పుచ్చు (కావిటీస్) వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాకుండా మంచి నిద్ర కూడా పడేందుకు ఇది సహాయపడుతుంది.

ఈ ఆహారాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది

చాలా ఆహార పదార్థాల్లో మనకు తెలియకుండానే అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు, స్వీట్లు, ఫ్లేవర్డ్ యోగర్ట్ లో కూడా చక్కెర మోతాదు అధికంగా ఉంటుంది. కేచప్, సాస్‌లు, రెడీ టు ఈట్ ఫుడ్స్‌లో కూడా హిడెన్ షుగ‌ర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఏ ఆహార పదార్థం కొనుగోలు చేసే ముందు దానిపై ఉన్న పోషక విలువల లేబుల్‌ను తప్పకుండా చదవాలి. తక్కువ చక్కెర ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.

ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు

చక్కెరను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. టీ, కాఫీలో చక్కెర పరిమాణాన్ని క్రమంగా తగ్గించడం, కూల్‌డ్రింక్స్‌కు బదులుగా నీరు లేదా తాజా పండ్లను తీసుకోవడం మంచి అలవాటు. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తగ్గించడం వల్ల రోజువారీ చక్కెర వినియోగాన్ని సులభంగా నియంత్రించవచ్చు. WHO సూచించిన పరిమితులను పాటిస్తే మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. చిన్న మార్పులతోనే ఆరోగ్యకరమైన జీవితాన్ని సులభంగా ప్రారంభించవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story