పావు కిలో చికెన్‌తో అరకిలో కూర.. పెరిగిన ధరలకు చెక్ పెట్టే అదిరిపోయే వంటింటి చిట్కా..!
Middle Class Food Tips: ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లలో ముక్క లేనిదే ముద్ద దిగదు.
పావు కిలో చికెన్‌తో అరకిలో కూర.. పెరిగిన ధరలకు చెక్ పెట్టే అదిరిపోయే వంటింటి చిట్కా..!
Budget Chicken Curry: పెరిగిపోతున్న చికెన్ ధరలతో వంట గదిలో ముక్క ముట్టుకోవాలంటేనే సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఆదివారం వస్తే చాలు కిలో చికెన్ కొనలేక చాలామంది పావు కిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ, ఇంట్లో మనుషులేమో ఎక్కువ. మరి పావు కిలో చికెన్‌తోనే ఇల్లంతా కడుపునిండా ముక్కలు తినాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే అరకిలో గ్రేవీ కూర ఇట్టే రెడీ అయిపోతుంది!
చికెన్ ధరలకు వంటింటి చెక్.. మధ్యతరగతి స్మార్ట్ ఐడియా..
ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లలో ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే, మార్కెట్‌లో చికెన్ ధరలు సెంచరీ డబుల్ సెంచరీ దాటి త్రిబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతుండటంతో మధ్యతరగతి కుటుంబాలు చికెన్ కొనాలంటేనే వెనకాడుతున్నాయి. కొందరు చికెన్ తినాలన్న కోరికను చంపుకోలేక కేవలం పావు కిలో మాత్రమే తెచ్చుకుంటున్నారు. కానీ, ఆ కాస్త కూర నలుగురు ఉన్న కుటుంబానికి ఎలా సరిపోతుందనేది పెద్ద ప్రశ్న. అస్సలు కంగారు పడకండి! మీ వంటింట్లో ఉండే కొన్ని సాధారణ పదార్థాలను జత చేస్తే, ఆ పావు కిలో కోడి ముక్కలే అరకిలో పైగా ఘుమఘుమలాడే గ్రేవీ కూరగా మారిపోతాయి.
ముక్కకు రుచి అబ్బాలంటే.. మ్యారినేషన్ ముఖ్యం..!
పావు కిలో చికెన్‌తో ఎక్కువ మందికి వండాలనుకున్నప్పుడు ముక్క ప్రతి ఒక్కరికీ రుచిగా తగలడం ముఖ్యం. అందుకోసం ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ గట్టి పెరుగు, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు పక్కన పెట్టడం వల్ల మసాలాలన్నీ ముక్కకు పట్టి, తక్కువ చికెన్ ఉన్నా కూడా అద్భుతమైన రుచి వస్తుంది.
కూర పరిమాణాన్ని పెంచే వంటింటి నేస్తాలు..
కూర క్వాంటిటీ పెరగాలంటే గ్రేవీతో పాటు ముక్కలు కూడా ఎక్కువగా కనిపించాలి. దీనికోసం చికెన్ వండేటప్పుడు కాస్త పెద్ద సైజులో కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలను సిద్ధం చేసుకోవాలి. కొంతమంది చికెన్ కూరలో బీరకాయ ముక్కలను కూడా వేస్తుంటారు. బీరకాయ చికెన్ కాంబినేషన్ కూర పరిమాణాన్ని పెంచడమే కాకుండా, కూరకు విలక్షణమైన కమ్మటి రుచిని అందిస్తుంది.
ఘుమఘుమలాడే విలేజ్ స్టైల్ తయారీ విధానం..
ముందుగా ఒక పాత్రలో (వీలైతే మట్టి పాత్రలో వండితే పల్లెటూరి రుచి వస్తుంది) నూనె వేసి వేడి చేయాలి. అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా, బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మూత పెట్టాలి.
చికెన్ నుంచి నీరు బయటకు రావడం ప్రారంభమయ్యాక, మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను అందులో వేయాలి. ఈ సమయంలోనే కూరకు మంచి ముక్కల ఆకృతితో పాటు చిక్కటి గ్రేవీ రావడానికి కొద్దిగా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలపాలి. కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల కూర క్వాంటిటీ ఈజీగా డబుల్ అవుతుంది. బంగాళాదుంపలు, చికెన్ మెత్తగా ఉడికే వరకు సన్నని మంటపై ఉడికించాలి. చివరిగా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి చల్లితే రెస్టారెంట్ స్టైల్ సువాసన వస్తుంది. దించే ముందు కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి అన్నంలోకి, రోటీల్లోకి ఫ్యామిలీ మొత్తం ఫుల్‌గా లాగించేసే చికెన్ గ్రేవీ కర్రీ సిద్ధం!
ఆదివారం నాన్‌వెజ్ వండాలనే ఆశకు బడ్జెట్ అడ్డురాకూడదంటే ఇలాంటి చిన్న చిన్న స్మార్ట్ ఐడియాలు ఎంతో ఉపయోగపడతాయి. తక్కువ చికెన్‌తోనే ఎక్కువ గ్రేవీ, అదనపు ముక్కలను జోడించి వండటం వల్ల అటు బడ్జెట్ పొదుపు అవుతుంది, ఇటు ఇంట్లో వాళ్లందరూ తృప్తిగా తింటారు. మీరు కూడా ఈ సారి మార్కెట్ నుంచి పావు కిలో చికెన్ తెచ్చినప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి!




