International Mens Day: ఒకప్పుడు ఉద్యోగాలంటే పురుషులదే హవా.. ఇప్పుడు పరిస్థితి ఎందుకు మారింది?
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా యువకులు ఎదుర్కొంటున్న విద్య, ఉద్యోగ సమస్యలపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
International Mens Day 2026
International Mens Day: సమాజంలో పురుషులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. అయితే పేద కుటుంబాలు, వలస నేపథ్యం, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువకులు చదువు, ఉద్యోగాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మారుతున్న ఉద్యోగ మార్కెట్, నైపుణ్యాల కొరత కూడా వారి అవకాశాలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈ పరిస్థితులపై ఓ పరిశీలన.
చదువులో అబ్బాయిలు వెనుకబడుతున్నారా?
నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా పురుషుల ఆరోగ్యం, మానసిక స్థితితో పాటు విద్య, ఉపాధి సమస్యలపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఉద్యోగాలు, వేతనాలు, ఉన్నత పదవుల్లో పురుషుల ఆధిపత్యం కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండటం లేదు. ముఖ్యంగా పేద కుటుంబాలు, వలస నేపథ్యం ఉన్నవారి పిల్లలు చదువులో వెనుకబడుతున్నారు. కొన్ని దేశాల్లో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు చదువును మధ్యలోనే ఆపేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి.
పాత ఉద్యోగాలు పోయాయి.. కొత్త స్కిల్స్ తప్పనిసరి
గతంలో పెద్దగా చదువుకోకపోయినా ఫ్యాక్టరీలు, తయారీ పరిశ్రమల్లో పురుషులకు మంచి వేతనాలతో ఉద్యోగాలు లభించేవి. ఇప్పుడు ఆటోమేషన్, సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు ప్రభావంతో ఇలాంటి ఉద్యోగాలు తగ్గుతున్నాయి. అమెరికాలో 1970లో తయారీ రంగ ఉద్యోగుల్లో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేయని వారి వాటా 43 శాతంగా ఉండగా.. 2016 నాటికి అది 10 శాతం కంటే తక్కువకు పడిపోయింది. దీంతో ఉద్యోగం పొందాలంటే విద్యార్హతలతో పాటు ప్రత్యేక నైపుణ్యాలు కూడా అవసరమవుతున్నాయి.
నర్సింగ్, టీచింగ్ రంగాల్లో పురుషులు తక్కువే
మరోవైపు వైద్యం, విద్య, నర్సింగ్, వృద్ధుల సంరక్షణ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ ఈ రంగాల్లో పురుషుల సంఖ్య తక్కువగా ఉంటోంది. కెనడాలో నమోదైన నర్సుల్లో దాదాపు 90 శాతం మంది మహిళలే. చిన్నప్పటి నుంచి కొన్ని ఉద్యోగాలు మహిళలకు మాత్రమే సరిపోతాయనే భావన ఉండటం కూడా దీనికి ఒక కారణం. అయితే వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, సంరక్షణ రంగాల్లో సిబ్బందికి డిమాండ్ పెరుగుతోంది. ఈ అవకాశాలను యువకులు కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
మహిళలతో పాటు పురుషులకూ సమాన అవకాశాలు
పురుషులకు అవకాశాలు కల్పించడం అంటే మహిళల అభివృద్ధిని అడ్డుకోవడం కాదు. మహిళలు ఇప్పటికీ వేతనాలు, ఉన్నత పదవుల్లో వివక్ష ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో వెనుకబడిన యువకులకు కూడా విద్య, ఉద్యోగ అవకాశాలు అందించాలి. నర్సింగ్, సంరక్షణ రంగాల్లో వేతనాలు, ఉద్యోగ గుర్తింపు పెంచితే మహిళలతో పాటు పురుషులకూ ప్రయోజనం కలుగుతుంది.
యువతకు దారి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
చదువులో వెనుకబడుతున్న అబ్బాయిలను గుర్తించి పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పెరిగే రంగాలకు అనుగుణంగా వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ అందించాలి. కంపెనీలు కూడా యువతకు శిక్షణ అవకాశాలు కల్పించాలి. ఆర్థికంగా వెనుకబడిన యువకులకు సరైన మార్గదర్శకత్వం అందితే వారి భవిష్యత్తు మెరుగుపడుతుంది. పురుషులందరూ ఒకే స్థాయిలో లేరనే వాస్తవాన్ని గుర్తించి, వెనుకబడిన వారికి అవకాశాలు కల్పించినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుంది.




