Health Tips: వర్షాకాలంలో ఆకుకూరలు తినొచ్చా.? డాక్టర్లు చెబుతున్న నిజాలివే..
వర్షాకాలంలో ఆకుకూరలు తింటే డయేరియా లేదా ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయనే ప్రచారంపై వైద్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు. వర్షాకాలంలో ఆకుకూరలు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Health Tips: వర్షాకాలంలో ఆకుకూరలు తినొచ్చా.? డాక్టర్లు చెబుతున్న నిజాలివే..
Health Tips: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మన దైనందిన ఆహారంలో రోజూ ఆకుకూరలు చేర్చుకోవాలని వైద్యులు నిరంతరం చెబుతుంటారు. అయితే, వర్షాకాలం రాగానే ఆకుకూరలు అస్సలు తినకూడదని, ఒకవేళ తింటే విరేచనాలు లేదా ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయని చాలామంది నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో, అసలు వర్షాకాలంలో ఆకుకూరలు తినొచ్చా? లేదా? అనే విషయంపై వైద్య నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు.
వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఖచ్చితంగా డయేరియా బారిన పడతారనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు, అది కేవలం ఒక అవాస్తవం మాత్రమే. అయితే, వర్షాల కారణంగా ఈ సీజన్‌లో ఆకుకూరల ఆకులపై మట్టి ఎక్కువగా పేరుకుపోతుంది. అంతేకాకుండా, తేమతో కూడిన వాతావరణం వల్ల వివిధ రకాల కీటకాలు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వాటిపై సులభంగా చేరుతుంటాయి. అందువల్ల, వర్షాకాలంలో ఆకుకూరలను సరిగ్గా శుభ్రం చేయకుండా నేరుగా వండుకుని తింటే మాత్రం అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఈ సీజన్‌లో ఆకుకూరలను సురక్షితంగా ఎలా తీసుకోవాలో వైద్యులు కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను సూచించారు. ఆకుకూరలను వండటానికి ముందు.. కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ వేసిన గోరువెచ్చని నీటిలో వాటిని సుమారు 10 నిమిషాల పాటు బాగా నానబెట్టాలి. ఆ తర్వాత, వాటిని తీసి మళ్లీ మంచి నీటితో శుభ్రంగా కడిగి ఆపైనే వండుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆకులపై ఉండే బ్యాక్టీరియా, క్రిములు, మట్టి పూర్తిగా తొలగిపోతాయి. వర్షాకాలంలో ప్రతిరోజూ ఆహారంలో సుమారు 50 గ్రాముల వరకు ఆకుకూరలను సురక్షితంగా తీసుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. కాబట్టి, భయపడకుండా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని ఆకుకూరలను మీ డైట్‌లో భాగం చేసుకోవచ్చు.




