Health: 6 వారాలకు మించి దురద వస్తోందా? ఈ సమస్యను అస్సలు లైట్ తీసుకోకండి!
Health: చర్మంపై ఎర్రటి దద్దుర్లు, తీవ్రమైన దురద రావడం కొన్నిసార్లు అలర్జీ వల్ల కావచ్చు. అయితే, ఈ సమస్య ఆరు వారాలకు మించి కొనసాగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు.
Health: 6 వారాలకు మించి దురద వస్తోందా? ఈ సమస్యను అస్సలు లైట్ తీసుకోకండి!
Health: చర్మంపై ఎర్రటి దద్దుర్లు, తీవ్రమైన దురద రావడం కొన్నిసార్లు అలర్జీ వల్ల కావచ్చు. అయితే, ఈ సమస్య ఆరు వారాలకు మించి కొనసాగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా (CSU) అనే దీర్ఘకాలిక చర్మ సమస్యకు సంకేతం కావచ్చు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఏమిటి?
ఆరు వారాలకు మించి దురద వస్తే ఏమవుతుంది?
చాలామందికి చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద వస్తే ఏదైనా ఆహారం లేదా ఇతర వస్తువుల వల్ల అలర్జీ వచ్చిందని భావిస్తారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు కొంతకాలానికి తగ్గిపోతాయి. కానీ దురద, దద్దుర్లు ఆరు వారాలకు మించి పదేపదే వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా పరిగణిస్తారు. దీనినే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా (CSU) అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో చర్మంపై ఎర్రటి లేదా చర్మం రంగులోనే ఉండే ఉబ్బిన దద్దుర్లు కనిపిస్తాయి. వీటితో పాటు తీవ్రమైన దురద కూడా ఉంటుంది. దద్దుర్లు కొంతసేపటికి తగ్గిపోయి, మళ్లీ మరోచోట కనిపించవచ్చు.
ఈ సమస్యకు కచ్చితమైన కారణం చాలాసార్లు తెలియదు. అందుకే ఆహారం లేదా ఏదైనా క్రీమ్ వల్లే ఇలా జరుగుతోందని అనుకోకూడదు. సమస్య పదేపదే వస్తుంటే వైద్యులను సంప్రదించి సరైన కారణాన్ని తెలుసుకోవాలి.
చర్మంపై వాపు వస్తే నిర్లక్ష్యం చేయకండి
దురద, దద్దుర్లతో పాటు కొంతమందికి చర్మం కింద వాపు కూడా వస్తుంది. దీనిని యాంజియోడీమా (Angioedema) అంటారు. ముఖ్యంగా పెదవులు, కనురెప్పలు, చేతులు, పాదాల దగ్గర ఈ వాపు కనిపించవచ్చు. ఈ వాపు కొన్నిసార్లు దద్దుర్లతో కలిసి వస్తుంది. మరికొన్నిసార్లు దద్దుర్లు లేకుండానే కనిపించవచ్చు. వాపు పదేపదే వస్తుంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి నాలుక లేదా గొంతు వాపు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, మింగలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. ఇవి తీవ్రమైన అలర్జీకి సంబంధించిన ప్రమాదకర లక్షణాలు కావచ్చు.
మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం
దురద నిరంతరం వేధిస్తుంటే శారీరక ఇబ్బందులతో పాటు మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా రాత్రివేళ దురద ఎక్కువైతే నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీంతో అలసట, చిరాకు, ఒత్తిడి పెరగవచ్చు. చర్మంపై దద్దుర్లు కనిపిస్తుండటంతో కొందరు ఇతరుల ముందు వెళ్లడానికి ఇబ్బంది పడతారు. సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం, పదేపదే దురద వస్తుందేమోనని ఆందోళన చెందడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
అయితే, ఈ సమస్యను దాచిపెట్టడం లేదా సిగ్గుతో వైద్య చికిత్సను వాయిదా వేయడం మంచిది కాదు. సరైన చికిత్సతో దురద, దద్దుర్లను నియంత్రించడంతో పాటు రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా తగ్గించుకోవచ్చు.
ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
చర్మంపై దురద, దద్దుర్లు ఆరు వారాలకు మించి కొనసాగితే చర్మవ్యాధి నిపుణుడిని లేదా అలర్జీ నిపుణుడిని సంప్రదించాలి. వైద్యులు లక్షణాలను పరిశీలించి, అవసరాన్ని బట్టి కొన్ని పరీక్షలు సూచించవచ్చు. ఇతర వ్యాధుల వల్ల కూడా దురద రావచ్చు కాబట్టి, లక్షణాలను బట్టి రక్త పరీక్షలు వంటి పరీక్షలు అవసరం కావచ్చు.
ఈ సమస్యకు వైద్యులు సూచించే యాంటీహిస్టమైన్ మందులు ఉపయోగపడవచ్చు. అయితే, మందుల మోతాదును వైద్యుల సూచన మేరకే తీసుకోవాలి. సొంతంగా మందులు వాడటం లేదా ఇప్పటికే వాడుతున్న మందులను వైద్యుల సలహా లేకుండా ఆపేయడం మంచిది కాదు.
చర్మంపై దురదకు అలర్జీ ఒక్కటే కారణం కాదు. కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. అందువల్ల సమస్య ఎక్కువకాలం కొనసాగుతున్నా, శరీరమంతా దురద వస్తున్నా లేదా ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నా వైద్యుల సలహా తీసుకోవాలి. సరైన సమయంలో సమస్యను గుర్తించి చికిత్స ప్రారంభించడం ద్వారా లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. లక్షణాలను బట్టి సరైన నిర్ధారణ, చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి.




