IVF Rules: ఐవీఎఫ్ అందరికీ పనిచేయదు.. ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త

IVF Rules: సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్స ఒక వరంగా మారింది.

CR Reddy
Published on: 6 Oct 2026 9:01 AM IST
IVF Rules
X

IVF Rules

IVF Rules: సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్స ఒక వరంగా మారింది. సహజంగా గర్భం దాల్చలేని వారికి ఈ ఆధునిక వైద్య విధానం ఎంతో ఆశను నింపుతోంది. ప్రతి ఒక్కరికీ ఐవీఎఫ్ ఒకేలా పనిచేయదని, కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలు ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్రమైన గుండె సమస్యలు లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే మహిళలకు ఐవీఎఫ్ అంత సురక్షితం కాకపోవచ్చు. గర్భధారణ సమయంలో శరీరంపై పడేదన అదనపు భారం వల్ల ఈ రోగులలో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వైద్యులు ఐవీఎఫ్ ప్రక్రియను అసలు సిఫార్సు చేయరు.

కిడ్నీ, కాలేయ సమస్యలు, గర్భాశయ లోపాలు

కిడ్నీ లేదా లివర్ ఫెయిల్యూర్ దశలో ఉన్న మహిళలకు ఐవీఎఫ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. గర్భాశయం లేకపోవడం, గర్భాశయంలో తీవ్రమైన సమస్యలు ఉండటం, కణజాలంలో ఎక్కువ పొరలు (అడ్హెషన్స్) ఏర్పడటం వంటి లోపాలు ఉంటే ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చడం అసాధ్యం. ఇటువంటి సందర్భాల్లో వైద్యులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించమని సూచిస్తారు.

అదుపులో లేని షుగర్, బిపి, థైరాయిడ్ సమస్యలు

శరీరంలో బిపి, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు అదుపులో లేనప్పుడు ఐవీఎఫ్ చికిత్స తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల చికిత్స విఫలమయ్యే అవకాశం పెరుగుతుంది. ప్రసవ సమయంలోనూ క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ముందస్తుగా ఈ సమస్యలన్నింటినీ మందుల ద్వారా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఐవీఎఫ్ గురించి ఆలోచించాలి.

క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాధితులు

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ రేడియోథెరపీ లేదా కీమోథెరపీ తీసుకోవాల్సిన మహిళలకు నేరుగా ఐవీఎఫ్ చేయడం సరికాదు. కీమోథెరపీ మందులు అండాల నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చికిత్స ప్రారంభించడానికి ముందే ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ (అండాలను భద్రపరచడం) చేసుకోవడం శ్రేయస్కరం. అనంతరం సర్రోగేసీ వంటి ఇతర మార్గాల ద్వారా సంతానం పొందేందుకు ప్రయత్నించవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.