Kausalyam 2026: హస్తకళలకు హైదరాబాద్ వేదిక.. జూలై 14 నుంచి కౌసల్యం 2026
హైదరాబాద్‌లో జూలై 14 నుంచి కౌసల్యం 2026 ప్రారంభం. దేశవ్యాప్తంగా చేతివృత్తులు, వస్త్ర కళలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.
Kausalyam 2026 Showcases India’s Handmade Craft Heritage
భారతీయ చేతివృత్తులు, సంప్రదాయ వస్త్ర కళలకు అంకితమైన 'కౌసల్యం 2026' ప్రదర్శన ఈ నెల హైదరాబాద్‌లో జరగనుంది. తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ (సీసీటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం జూలై 14 నుంచి 16 వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు.
ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ ప్రదర్శనకు ప్రవేశం పూర్తిగా ఉచితం. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఎలాంటి నమోదు లేకుండా నేరుగా ప్రదర్శనను సందర్శించే అవకాశం కల్పించారు.
ఈసారి దేశవ్యాప్తంగా 75కు పైగా వస్త్ర కళాకారులు, చేతివృత్తుల ప్రదర్శకులు పాల్గొంటున్నారు. 120కుపైగా స్టాళ్లలో సంప్రదాయ వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు, ప్రత్యేక కళాఖండాలు ప్రదర్శనకు ఉంచనున్నారు. అలాగే 40కుపైగా ప్రత్యేక చేతిపనుల సేకరణలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
భారతీయ వస్త్ర సంప్రదాయాల చరిత్రను పరిచయం చేసే ప్రత్యేక టెక్స్‌టైల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వస్త్ర కళల పరిణామ క్రమం, సంప్రదాయ నేయ్పు విధానాలు, అరుదైన నమూనాలను ప్రదర్శించనున్నారు.
చేతివృత్తుల రంగంలో పనిచేస్తున్న కళాకారులు, డిజైనర్లు, వ్యాపారవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశాన్ని కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయ కళలను ఆధునిక మార్కెట్‌లో ఎలా నిలబెడుతున్నారో సందర్శకులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా తెలుగు, ఆంగ్ల భాషల్లో తోలుబొమ్మలాట ఆధారంగా రూపొందించిన 'సీత అన్వేషణ' ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే శతాబ్దాల చరిత్ర కలిగిన చేర్యాల చిత్రపట కథనాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవిస్తూ రూపొందించిన ప్రత్యేక ప్రదర్శన కూడా నిర్వహించనున్నారు.
1987 నుంచి సంప్రదాయ కళల పరిరక్షణ కోసం పనిచేస్తున్న తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా కళాకారుల అభివృద్ధికి నిధులు సమీకరించే కార్యక్రమంగా కూడా కొనసాగుతోంది.
ఈ ఏడాది ప్రదర్శన ద్వారా సమకూరే నిధులను ప్రధానంగా భరూన్ ఎంబ్రాయిడరీ కళ పునరుద్ధరణకు వినియోగించనున్నారు. సింధీ మహిళలు ప్రధానంగా కొనసాగిస్తున్న ఈ అరుదైన చేతి ఎంబ్రాయిడరీ కళ అంతరించిపోకుండా పరిరక్షించడం, కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.




