Kidney Stone vs UTI: కిడ్నీ స్టోన్, యూటీఐ సమస్యల మధ్య తేడా ఏమిటి? ఈ లక్షణాలతో ఇట్టే కనిపెట్టవచ్చు

Kidney Stone vs UTI: ఆరోగ్య సమస్యల్లో కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ) చాలా సాధారణమైనవి

CR Reddy
Published on: 30 Oct 2026 9:30 AM IST
Kidney Stone
X

Kidney Stone

Kidney Stone vs UTI: ఆరోగ్య సమస్యల్లో కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ) చాలా సాధారణమైనవి. అయితే ఈ రెండు సమస్యల లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉండటంతో చాలామంది తీవ్రమైన గందరగోళానికి గురవుతుంటారు. యూటీఐ ఇన్ఫెక్షన్ ముదిరితే కిడ్నీ వరకు చేరుకుని స్టోన్‌కు దారితీస్తుంది. అలాగే కిడ్నీ స్టోన్ కారణంగా యూరిన్ పాస్ చేయడంలో అడ్డంకులు ఏర్పడితే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఈ రెండు సమస్యలకు మధ్య ఉన్న తేడా ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలను తెలుసుకుందాం.

కిడ్నీ స్టోన్ లక్షణాలు.. నొప్పి పెట్టే విధానం

నిపుణుల ప్రకారం.. కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు విపరీతమైన మంటతో పాటు తీవ్రమైన నొప్పి వస్తుంది. ముఖ్యంగా స్టోన్ తన స్థానాన్ని మార్చినప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. స్టోన్ కిడ్నీలోనే ఉంటే వెన్నెముకకు రెండు వైపులా నొప్పి కలుగుతుంది. ఒకవేళ రాయి కిందకు కదిలితే ఆ నొప్పి వెనుక భాగం నుంచి కింది వైపునకు మారుతుంది. రాయి యూరిటర్ ముఖద్వారం దగ్గరకు వస్తే కడుపు కింద భాగంలో విపరీతమైన నొప్పి, తీవ్రమైన మంట వేధిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తక్కువ నీరు తాగడం వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది.

యూటీఐ ఇన్ఫెక్షన్ లక్షణాలు

యూరినరీ ట్రాక్ట్‌లో ఏ భాగంలో ఇన్ఫెక్షన్ సోకిందనే దానిని బట్టి లక్షణాలు మారుతుంటాయి. యూరెత్రా దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట కలుగుతుంది. ఇన్ఫెక్షన్ మూత్రశాలకు చేరితే కడుపు కింద భాగంలో నొప్పి, తాకినప్పుడు సున్నితత్వం, జ్వరం వస్తాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ కిడ్నీ దాకా వెళితే దాన్ని పైలోనెఫ్రిటిస్ అంటారు. ఈ ప్రమాదకర స్థితిలో వెన్నెముకకు ఇరువైపులా భరించలేని నొప్పి వస్తుంది. అధిక జ్వరం రావడం వల్ల రోగి తీవ్ర అస్వస్థతకు గురవుతారు.

కిడ్నీ స్టోన్, యూటీఐ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ రెండు అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే కొన్ని జీవనశైలి మార్పులు తప్పనిసరిగా పాటించాలి. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచి నీరు తాగడం ద్వారా మినరల్స్ పేరుకుపోకుండా చూసుకోవచ్చు. ఉప్పు వాడకాన్ని తగ్గించి, బరువును అదుపులో ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఈకోలి బ్యారియా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. టైట్ అండర్‌గ్రామెంట్స్ ధరించకుండా ఉండటం, యూరిన్ వచ్చిన వెంటనే వెళ్లడం చాలా ముఖ్యం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.