Lifestyle: మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు
Lifestyle: ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం చాలా పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, వీడియోలు చూస్తూ గంటల తరబడి గడపడం చాలా మందికి అలవాటైంది.
Lifestyle
Lifestyle: ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం చాలా పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, వీడియోలు చూస్తూ గంటల తరబడి గడపడం చాలా మందికి అలవాటైంది. కానీ ఈ అలవాటు మన మానసిక ఆరోగ్యంపై నెగటివ్ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగే ప్రమాదం ఉంది.
పరిశోధనలో బయటపడిన విషయాలు
జర్మనీలో జరిగిన ఒక అధ్యయనంలో ఒక సులభమైన పరిష్కారం బయటపడింది. రోజుకు కేవలం 30 నిమిషాలు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి, ఆ సమయాన్ని వ్యాయామానికి కేటాయిస్తే మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని తేలింది. చిన్న మార్పు చేసినా పెద్ద ఫలితం వస్తుందని ఈ స్టడీ చెబుతోంది.
స్టడీ ఎలా నిర్వహించారు?
ఈ పరిశోధనలో 642 మందిని నాలుగు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఒక గ్రూప్ సోషల్ మీడియా సమయం తగ్గించింది. మరో గ్రూప్ వ్యాయామం పెంచింది, మూడో గ్రూప్ ఈ రెండు మార్పులు చేసింది. నాలుగో గ్రూప్ ఎలాంటి మార్పు చేయలేదు. రెండు వారాల పాటు వారి మూడ్, ఒత్తిడి, సంతోషం, జీవితం పట్ల సంతృప్తిని పరిశీలించారు.
తేలిన ఫలితం ఏంటి.?
సోషల్ మీడియా తగ్గించినవారు, వ్యాయామం పెంచినవారు ఇద్దరిలోనూ మంచి మార్పు కనిపించింది. వారు మరింత సంతోషంగా, తక్కువ ఒత్తిడితో ఉన్నారు. ముఖ్యంగా ఈ రెండు అలవాట్లను కలిపి పాటించినవారిలో అత్యధిక లాభం కనిపించింది. డిప్రెషన్ లక్షణాలు కూడా తగ్గినట్లు గమనించారు.
నిపుణుల సూచనలు
నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, సోషల్ మీడియా ఎక్కువగా వాడితే అది ఒక అలవాటుగా మారుతుంది. నిరంతరం నోటిఫికేషన్లు, ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. అదే సమయంలో వ్యాయామం, నడక, యోగా వంటి శారీరక కార్యకలాపాలు మన మూడ్‌ను మెరుగుపరుస్తాయి. ఈ మార్పులను పాటించిన వారిలో 6 నెలల తర్వాత కూడా మంచి ఫలితాలు కొనసాగినట్లు పరిశోధన చెబుతోంది. కాబట్టి రోజూ చిన్న మార్పు చేసుకోవడం ద్వారా మన జీవితం మరింత సంతోషంగా మార్చుకోవచ్చు.




