Monsoon skincare : వర్షాకాలంలో బేబీ స్కిన్ కేర్ టిప్స్
Monsoon skincare : వర్షాకాలంలో పసిపిల్లల చర్మంపై వచ్చే దద్దుర్లు, ఎరుపుదనాన్ని తగ్గించేందుకు బెస్ట్ టిప్స్ ఇవే.
వర్షాకాలంలో బేబీ స్కిన్ కేర్ టిప్స్
Monsoon skincare : వర్షాకాలం వచ్చిందంటే చాలు వాతావరణంలో తేమ శాతంతో పాటు ఉక్కపోత (హ్యుమిడిటీ) ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సీజన్ పెద్దలకే కాదు, పసిపిల్లల సున్నితమైన చర్మానికి కూడా పెద్ద సవాలుగా మారుతుంది. మీ చిన్నారి చర్మ మడతలలో ఎరుపుదనం, దద్దుర్లు, చెమటకాయలు లేదా పొడిబారడం వంటి సమస్యలను మీరు గమనించారా? అయితే అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ.
ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, భారత 'హెర్బల్ క్వీన్' షహనాజ్ హుస్సేన్ వర్షాకాలంలో పసిపిల్లల చర్మ సంరక్షణ కోసం కొన్ని అద్భుతమైన చిట్కాలను పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
పసిపిల్లల స్నానపు షెడ్యూల్ ఇలా ఉండాలి:
నవజాత శిశువులకు స్నానం చేయించడం ప్రారంభంలో కొంచెం కష్టంగా అనిపించినా, కొన్ని నియమాలు పాటిస్తే చాలా సులభం.
అతిగా స్నానం వద్దు: పిల్లలకు పదే పదే స్నానం చేయించకూడదు. దీనివల్ల చర్మంలోని సహజ నూనెలు కోల్పోయి చర్మం పొడిబారుతుంది.
వారానికి ఎన్నిసార్లు?: రెండు నెలల లోపు వయసున్న శిశువులకు వారానికి 2-3 సార్లు స్నానం చేయిస్తే సరిపోతుంది. అంతకంటే పెద్ద పిల్లలకు రోజుకు ఒకసారి (చెమటలు పడితే) స్నానం చేయించవచ్చు.
మైల్డ్ బాడీ వాష్: సాధారణ కెమికల్ సబ్బుల వల్ల చర్మం దెబ్బతింటుంది. కాబట్టి సువాసన లేని (Unscented) మైల్డ్ బాడీ వాష్‌లను మాత్రమే వాడాలి. అలాగే స్నానం ఎప్పుడూ 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టకూడదు.
సరైన సమయం: పాలు తాగించిన వెంటనే స్నానం చేయించకూడదు, కనీసం ఒక గంట గ్యాప్ ఇవ్వాలి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తే పిల్లలు హాయిగా నిద్రపోతారు.
దుస్తుల ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
వర్షాకాలంలో పిల్లలకు గాలి ఆడేలా ఉండే మెత్తటి కాటన్ (పత్తి) దుస్తులను మాత్రమే వేయాలి. బిగుతుగా ఉండే బట్టలను పూర్తిగా దూరం పెట్టాలి.
పిల్లలకు ఎక్కువ లేయర్ల బట్టలు వేయకూడదు, దీనివల్ల ఎక్కువ చెమట పట్టి చర్మంపై దద్దుర్లు వస్తాయి.
సింథటిక్ దుస్తులను అస్సలు వాడకూడదు. బట్టలు పూర్తిగా ఆరిన తర్వాతే పిల్లలకు వేయాలి. వీలైతే దుస్తులను సూర్యరశ్మిలోనే ఆరబెట్టడం మంచిది.
పిల్లలను ఎక్కువ సేపు తడి బట్టల్లో లేదా మురికి డయాపర్లలో ఉంచకూడదు. ఎక్కువ అబ్సార్బెంట్ సామర్థ్యం ఉన్న డయాపర్లను వాడుతూ, వాటిని క్రమంతప్పకుండా మారుస్తూ ఉండాలి.
బేబీ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు ఏం చూడాలి?
శిశువు చర్మం మూడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి చర్మాన్ని ఎల్లప్పుడూ మాయిశ్చరైజ్ చేయడం ముఖ్యం.
హానికరమైన రసాయనాలు, కృత్రిమ సువాసనలు లేని ఆర్గానిక్ లేదా హెర్బల్ ప్రొడక్ట్స్‌ను ఎంచుకోవాలి.
బేబీ క్రీమ్స్, లోషన్స్ కొనేటప్పుడు అందులో అలోవెరా, షియా బటర్, కొబ్బరి నూనె, బాదం నూనె, కోకో బటర్, మిల్క్ క్రీమ్ వంటి సహజసిద్ధమైన పదార్థాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. డెర్మటాలజిస్ట్ (చర్మ నిపుణులు) ధృవీకరించిన ప్రొడక్ట్స్ మాత్రమే వాడటం సురక్షితం.
సూర్యరశ్మి, ఎండ నుండి రక్షణ:
వర్షాకాలం అయినప్పటికీ సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన యూవీ (UV) కిరణాల ప్రభావం ఉంటుంది.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో పిల్లలను బయటకు తీసుకెళ్లకపోవడమే మంచిది.
ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే.. శరీరం పూర్తిగా కప్పబడేలా లేత రంగు దుస్తులు వేయాలి. తలకు వెడల్పాటి టోపీ వాడటం లేదా గొడుగు, స్ట్రోలర్ కానోపిలను ఉపయోగించాలి.
6 నెలల లోపు పిల్లలకు సన్‌స్క్రీన్ లోషన్లు వాడకూడదు. అంతకంటే పెద్ద పిల్లలకు వాడాలనుకుంటే పీడియాట్రిషియన్ (పిల్లల డాక్టర్) సలహా తీసుకోవాలి. అలాగే రెండు నెలల లోపు పిల్లలపై దోమల నివారణ మందులు (Insect Repellent) వాడటం మంచిది కాదు.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మరియు సరైన స్కిన్ కేర్ రొటీన్ పాటించడం ద్వారా వర్షాకాలంలో మీ చిన్నారి చర్మాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవచ్చని షహనాజ్ హుస్సేన్ సూచిస్తున్నారు.




