Health Tips: నిద్ర లేవగానే ఆకలి, అలసట ఉంటోందా.? అయితే బీ కేర్ ఫుల్.!
Health Tips: ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన అలసట, నీరసం, ఆకలితో ఇబ్బంది పడుతున్నారా.? భవిష్యత్తులో డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Health Tips: నిద్ర లేవగానే ఆకలి, అలసట ఉంటోందా.? అయితే బీ కేర్ ఫుల్.!
Health Tips: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సరైన నిద్ర లేకపోవడం. అయితే, రాత్రి కంటినిండా నిద్రపోయినా సరే ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన అలసట, నీరసం, ఆకలి వేయడం లాంటి లక్షణాలు మీలో ఎప్పుడైనా కనిపిస్తున్నాయా? ఉదయాన్నే శరీరం చురుకుగా ఉండటానికి బదులుగా ఇలాంటి నీరసం రావడం అనేది సాధారణ సమస్యే అని చాలామంది తేలికగా కొట్టిపారేస్తుంటారు. కానీ, ఇవి కేవలం సాధారణమైన అలసట లక్షణాలు మాత్రమే కావని, భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య ముప్పునకు ఇవి స్పష్టమైన ముందస్తు సంకేతాలని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని గట్టిగా సూచిస్తున్నారు.
ఉదయం నిద్ర లేవగానే ఇలా విపరీతమైన అలసట, ఆకలి కలగడం అనేది శరీరంలో 'ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకత అంటే మన శరీరంలోని కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు సరిగ్గా స్పందించకపోవడం. దీనివల్ల రక్తంలోని గ్లూకోజ్ కణాల్లోకి చేరక శక్తిగా మారదు, ఫలితంగా ఎప్పుడూ నీరసంగా, ఆకలిగా అనిపిస్తుంది.
సాధారణంగా ఒక వ్యక్తి శరీరానికి వరుసగా కనీసం నాలుగు రోజుల పాటు గాఢ నిద్ర లభించనప్పుడు శరీరంలో ఇలాంటి విపరీతమైన పరిస్థితి తలెత్తుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నిద్రలేమి వల్ల శరీరంలోని మెటబాలిజం దెబ్బతిని ఇన్సులిన్ పనితీరు పూర్తిగా మందగిస్తుంది. ఇలాంటి ఇబ్బందులు పదేపదే ఎదుర్కొంటున్న వ్యక్తులు అతి త్వరలో డయాబెటిస్ బారిన పడే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే, ఈ ప్రమాదకరమైన ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మన రోజువారీ దినచర్యలో తక్షణమే కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ఎంతో అత్యవసరం.
ముఖ్యంగా మన జీవనశైలిలో సానుకూలమైన మార్పులు తీసుకురావడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఎలాంటి ఆటంకాలు లేని గాఢమైన నిద్ర పోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. దీనికి తోడుగా, రోజువారీ ఆహారంలో పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉండే క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్స్, చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాలకు శాశ్వతంగా దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునన్నారు.




