Motion Sickness: కొందరికి ప్రయాణం చేసేప్పుడు వాంతులు ఎందుకొస్తాయి.? దీనికి అసలు కారణం ఏంటంటే
Motion Sickness: మనలో కొంతమందికి ప్రయాణం మొదలుపెట్టగానే వాంతులు, తల తిరగడం, గుండె దడ, చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తుంటాయి.
Motion Sickness: కొందరికి ప్రయాణం చేసేప్పుడు వాంతులు ఎందుకొస్తాయి.? దీనికి అసలు కారణం ఏంటంటే
Motion Sickness: మనలో కొంతమందికి ప్రయాణం మొదలుపెట్టగానే వాంతులు, తల తిరగడం, గుండె దడ, చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తుంటాయి. సాధారణంగా దీనిని “మోషన్ సిక్నెస్” అని అంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఈ సమస్య రావచ్చు. కొన్ని సందర్భాల్లో మొత్తం ప్రయాణాన్నే ఇబ్బందికరంగా మార్చేస్తుంది.
మోషన్ సిక్‌నెస్ అంటే ఏమిటి?
క్లీవ్‌లాండ్ క్లినిక్ ప్రకారం, కళ్లకు కనిపించే సమాచారం, చెవుల్లోని బ్యాలెన్స్ వ్యవస్థ, శరీర కదలికలు.. ఇవన్నీ మెదడుకు ఒకే విధమైన సంకేతాలు పంపకపోతే ఈ సమస్య వస్తుంది. ఉదాహరణకు కారు ప్రయాణంలో బయట చెట్లు, రోడ్లు వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నట్లు కళ్లకు కనిపిస్తుంది. దీంతో శరీరం కదులుతోందని మెదడు భావిస్తుంది. కానీ లోపలి చెవి, కండరాలు మాత్రం శరీరం స్థిరంగా ఉందని సంకేతాలు పంపిస్తాయి. ఈ రెండు భిన్న సంకేతాల వల్ల మెదడు గందరగోళానికి గురై మోషన్ సిక్‌నెస్ కలుగుతుంది.
ప్రయాణాల్లోనే కాదు.. గేమ్స్ వల్ల కూడా వస్తుంది
మోషన్ సిక్నెస్ కేవలం ప్రయాణాల సమయంలోనే కాదు. ప్రస్తుతం వీడియో గేమ్స్, వర్చువల్ రియాలిటీ (VR) గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా చాలా మందికి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీనిని “వర్చువల్ మోషన్ సిక్నెస్” అని అంటారు. గేమ్ ఆడేటప్పుడు కళ్లకు వేగంగా కదులుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. కానీ శరీరం మాత్రం కదలదు. దీంతో మెదడుకు తారుమారు సంకేతాలు వెళ్లి తల తిరగడం, వికారం, వాంతులు రావచ్చు.
ఈ సమస్యలో కనిపించే ముఖ్య లక్షణాలు
మోషన్ సిక్‌నెస్ వచ్చినప్పుడు సాధారణంగా తల తిరగడం, వాంతులు రావడం, వికారం, చల్లటి చెమటలు పట్టడం
ఎక్కువగా లాలాజలం రావడం, అలసట, తలనొప్పి, వేగంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిపుణుల ప్రకారం 2 నుంచి 12 ఏళ్ల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మైగ్రేన్, గర్భధారణ, పార్కిన్సన్ వ్యాధి లేదా చెవుల బ్యాలెన్స్ సమస్యలు ఉన్నవారిలో కూడా మోషన్ సిక్నెస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డాక్టర్ల సూచనల ప్రకారం కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే మోషన్ సిక్‌నెస్ తగ్గించే అవకాశం ఉంటుంది. వాహనంలో ముందు సీట్లో కూర్చోవడం, కిటికీ పక్కన కూర్చుని తాజా గాలి పీల్చడం, మొబైల్ లేదా పుస్తకం చూడకుండా దూరంలోని వస్తువులపై దృష్టి పెట్టడం, ప్రయాణానికి ముందు అధికంగా తినకపోవడం, మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇంటి చిట్కాలు, మందులతో కూడా ఉపశమనం
కొంతమందికి అల్లం టీ, పుదీనా క్యాండీలు తీసుకుంటే వికారం తగ్గుతుంది. అల్లంలో ఉండే సహజ గుణాలు వాంతుల భావనను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో యాంటీహిస్టామిన్ మాత్రలు లేదా ప్రత్యేక ప్యాచ్‌లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ప్రయాణ సమయంలో తల తిరగడం, వాంతులు తగ్గించడంలో సహాయపడతాయి.




