National Dengue Day: మీ ఇంట్లో కూడా దోమల అగరబత్తులు వాడుతున్నారా.? ప్రమాదంలో పడుతున్నట్లే
National Dengue Day: దేశంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఇంట్లో దోమల అగరబత్తులు, కాయిల్స్ వాడుతున్నారు.
National Dengue Day: మీ ఇంట్లో కూడా దోమల అగరబత్తులు వాడుతున్నారా.? ప్రమాదంలో పడుతున్నట్లే
National Dengue Day: దేశంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఇంట్లో దోమల అగరబత్తులు, కాయిల్స్ వాడుతున్నారు. అయితే ఇవే ఇప్పుడు మరో పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతున్నాయని తాజా సర్వే వెల్లడించింది. ముఖ్యంగా నియంత్రణ లేకుండా అమ్ముతున్న దోమల అగరబత్తులు శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో భారీగా అక్రమ దోమల అగరబత్తుల అమ్మకాలు
హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (HICA) ఆదేశాలపై మార్కెట్ రీసెర్చ్ సంస్థ కాంతర్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భారత్‌లో దోమల అగరబత్తుల మార్కెట్ విలువ దాదాపు రూ. 2,000 కోట్లుగా ఉంది. ఇందులో సుమారు 85 శాతం వరకు అక్రమ లేదా నియంత్రణ లేని ఉత్పత్తులే ఉన్నట్లు గుర్తించారు.
ఈ సర్వేలో దేశంలోని 12 నగరాల్లో 1,264 కుటుంబాలు, 405 మంది వైద్యులను సంప్రదించారు. చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ అనుమతి లేని ఉత్పత్తులను వాడుతున్నట్లు తేలింది.
ప్రమాదకర రసాయనాలతో ఆరోగ్యానికి ముప్పు
వైద్యుల ప్రకారం దోమలను తరిమికొట్టడం అవసరమే అయినా, అగరబత్తుల నుంచి వచ్చే పొగను నిరంతరం పీల్చడం ప్రమాదకరం. కొన్ని ఉత్పత్తుల్లో పైరిత్రాయిడ్స్, ఆర్గనోఫాస్ఫేట్స్, హెవీ మెటల్స్ వంటి విషపూరిత రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ఇవి శ్వాసనాళాలను ప్రభావితం చేసి దగ్గు, అలర్జీలు, ఊపిరితిత్తుల ఇబ్బందులు, ఆస్తమా సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఇప్పటికే శ్వాసకోశ సమస్యలున్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా అమ్ముతున్న ఉత్పత్తులు
సర్వేలో బయటపడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, అనేక కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. ఈ ఉత్పత్తులపై కేంద్రకీటకనాశకాలు రిజిస్ట్రేషన్ (CIR) లేబుల్ లేదు, పదార్థాల వివరాలు స్పష్టంగా లేవు, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. కంఫర్ట్, స్లీప్‌వెల్, రిలాక్స్, సన్ రిలాక్స్, హంటింగ్ టైగర్, డెంగ్యూ కిల్లర్, హై పవర్ వంటి పేర్లతో ఈ ఉత్పత్తులు మార్కెట్‌లో అమ్ముతున్నట్లు నివేదిక పేర్కొంది.
ప్రజలు ఎక్కువగా వాడుతున్న దోమల అగరబత్తులు
సర్వే ప్రకారం 59 శాతం మంది ఇలాంటి దోమల అగరబత్తులను వాడుతున్నట్లు చెప్పారు. వీరిలో సగం మంది మూడు సంవత్సరాలకు పైగా ప్రతిరోజూ వాడుతున్నారని వెల్లడైంది. వ్యాధుల నుంచి రక్షణ కోసం వాడుతున్న ఉత్పత్తుల వల్లే భవిష్యత్తులో శ్వాసకోశ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
దోమల నుంచి రక్షణకు సురక్షిత మార్గాలు ఏవి?
వైద్యులు, ఆరోగ్య నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఉత్పత్తులనే వాడాలి.
అగరబత్తులను మూసివేసిన గదుల్లో ఎక్కువసేపు వెలిగించకూడదు. దోమతెరలు, మెష్ విండోలు ఉపయోగించడం మంచిది. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. చిన్నపిల్లల దగ్గర ఎక్కువ పొగ వచ్చే ఉత్పత్తులు వాడకూడదు. డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి రక్షణ అవసరమే అయినా, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.




