నవంబర్‌లో ప్రయాణాలకు వెళ్తున్నారా? ఈ 8 అద్భుతమైన ప్రదేశాలను అసలు మిస్ కావొద్దు!
November Travel Destinations నవంబర్ నెలలో విహారయాత్రలకు వెళ్లడానికి ఉత్తమమైన 8 పర్యాటక ప్రాంతాలు. షిల్లాంగ్, వారణాసి, కచ్, పుష్కర్ ప్రత్యేకతల పూర్తి వివరాలు.
నవంబర్‌లో ప్రయాణాలకు వెళ్తున్నారా? ఈ 8 అద్భుతమైన ప్రదేశాలను అసలు మిస్ కావొద్దు!
November Travel Destinations: భారతదేశంలో నవంబర్ నెల వచ్చిందంటే చాలు.. వర్షాకాలం వీడి దేశవ్యాప్తంగా ఆహ్లాదకరమైన చలి వాతావరణం మొదలవుతుంది. ఈ సమయంలో కొండ ప్రాంతాలు అందమైన ప్రకృతి అందాలతో, ఎడారి ప్రాంతాలు సాంస్కృతిక జాతరలతో కళకళలాడుతుంటాయి. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికి నవంబర్ సరైన సమయం. ఈ మాసంలో తప్పక సందర్శించాల్సిన టాప్-8 పర్యాటక ప్రాంతాలు ఇవే:
1. షిల్లాంగ్ (మేఘాలయ):
ఈ ప్రాంతంలో నవంబర్ నెలలో గులాబీ రంగు చెర్రీ పూలు చెట్లకు పూసి కనువిందు చేస్తాయి. వార్డ్స్ లేక్, ఉమియం సరస్సు పరిసరాలు సుందరంగా మారుతాయి. అంతేకాకుండా నవంబర్ 20, 21 తేదీల్లో జరిగే 'షిల్లాంగ్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్' ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
2. వారణాసి (ఉత్తరప్రదేశ్):
ఆధ్యాత్మిక యాత్రలను ఇష్టపడేవారికి వారణాసి ఉత్తమ ఎంపిక. నవంబర్ 24న జరిగే 'దేవ్ దీపావళి' సందర్భంగా గంగా నది తీరంలోని ఘాట్లన్నీ వేలాది దీపాలతో వెలిగిపోతాయి. దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతి, సాయంత్రం పడవ ప్రయాణం అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి.
3. పుష్కర్ (రాజస్థాన్):
ప్రసిద్ధ ఒంటెలు, పశువుల జాతరకు పుష్కర్ వేదిక కానుంది. నవంబర్ 17 నుంచి 24 వరకు జరిగే ఈ జాతరలో సంప్రదాయ పోటీలు, జానపద కళారూపాలు, ఎడారి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
4. కచ్ (గుజరాత్):
తెల్లని ఉప్పు మైదానాలు, విశాలమైన ఆకాశం కచ్ ప్రత్యేకత. నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 'రణ్ ఉత్సవ్'లో గుజరాత్ సంప్రదాయ కళలు, హస్తకళలు, స్థానిక వంటకాలు మరియు సూర్యాస్తమయాల అందాలను ఆస్వాదించవచ్చు.
5. కాన్హా నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్):
వన్యప్రాణి ప్రేమికులకు నవంబర్ నుంచి సీజన్ మరింత అనుకూలంగా ఉంటుంది. జీప్ సఫారీ ద్వారా పులులు, చిరుతలు, బారాసింగా జింకలను చూసేందుకు ఇది సరైన సమయం.
6. చిలికా సరస్సు (ఒడిశా):
భారతదేశంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికాకు నవంబర్ నుంచి వలస పక్షులు రావడం ప్రారంభిస్తాయి. ఫ్లెమింగోలు, పెలికాన్‌లతో పాటు సతపాడా ప్రాంతంలో ఇరావడి డాల్ఫిన్‌లను వీక్షించవచ్చు.
7. అమృత్‌సర్ (పంజాబ్):
నవంబర్ 24న గురునానక్ జయంతి (గురుపురబ్) వేడుకల సందర్భంగా స్వర్ణ దేవాలయం విద్యుత్ దీపాలతో, అలంకరణలతో మెరిసిపోతుంది. ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు స్థానిక అమృత్‌సరి వంటకాలను రుచి చూడవచ్చు.
8. కొల్లం (కేరళ):
అష్టముడి సరస్సులో జరిగే 'ప్రెసిడెంట్స్ ట్రోఫీ బోట్ రేస్' పడవ పోటీలతో ఈ ప్రాంతం సందడిగా మారుతుంది. పచ్చదనంతో కళకళలాడే కేరళ బ్యాక్‌వాటర్స్‌లో ప్రయాణించడానికి ఈ సమయం ఎంతో అనుకూలం.




