Osteoporosis Care: ఇంట్లో పెద్దలు ఉన్నారా? ప్రమాదాల బారిన పడకుండా ఈ 5 పనులు చేయండి
వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. 50 ఏళ్లు దాటిన పెద్దలు ఇంట్లో ఉంటే ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
Senior Citizen Safety Tips
Osteoporosis Care: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం సర్వసాధారణం. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు మహిళలను ఎక్కువగా వేధిస్తుంటాయి. ఐదుపదుల వయసు దాటిన పెద్దలు ఇంట్లో ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎముకలు గుల్లబారడం వల్ల చిన్న కిందపడినా తీవ్రమైన ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఉంది. కేవలం మంచి ఆహారపు అలవాట్లతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా పెద్దలను ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇళ్లలో వృద్ధుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 జాగ్రత్తలు తెలుసుకుందాం.
యాంటీ-స్కిడ్ మ్యాట్లు ఏర్పాటు చేయడం
ఇళ్లల్లో ముఖ్యంగా బాత్రూమ్‌లు, తడి నేలలు ఉన్న ప్రాంతాల్లో వృద్ధులు జారిపడే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలా జారిపడటం వల్ల తుంటి ఎముకలు, కీళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి జారే గుణం లేని యాంటీ-స్కిడ్ మ్యాట్లను ఇంట్లో వేయాలి. దీనివల్ల కాళ్లు జారకుండా గ్రిప్ దొరుకుతుంది. అలాగే పెద్దలు నడిచే మార్గాల్లో ఎప్పుడూ తడి ఉండకుండా పొడిగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.
గ్రిబ్ బార్లు బిగించడం
బాత్‌రూమ్‌లు, టాయ్‌లెట్లలో లేచి నిలబడేటప్పుడు వృద్ధులకు ఆసరాగా ఉండేలా గ్రిబ్ బార్లు అమర్చాలి. గోడలకు గట్టిగా బిగించిన ఈ హ్యాండిల్స్ పెద్దలకు చక్కటి మద్దతునిస్తాయి. కూర్చుని లేచే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. మెట్లకు ఇరువైపులా పట్టుకోవడానికి గట్టి రైలింగ్‌లు ఉండేలా చూసుకోవాలి. చిన్నపాటి ఈ మార్పులు పెద్దల భద్రతకు ఎంతో భరోసా ఇస్తాయి.
గ్రౌండ్ ఫ్లోర్‌లో గదులు కేటాయించడం
వయసు పెరిగిన కొద్దీ మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు తీవ్రమవుతాయి. అలాంటి సమయంలో వృద్ధులు మెట్లు ఎక్కడం చాలా ప్రమాదకరం. అందుకే వారి బెడ్‌రూమ్, బాత్రూమ్ వంటివి ఎప్పుడూ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ ఇల్లు రెండస్తులదైతే కింది భాగంలోనే వారికి గదిని కేటాయించడం మంచిది. దీనివల్ల రోజూ మెట్లు ఎక్కే శ్రమ తప్పుతుంది.
నిత్యవసరాలు అందుబాటులో ఉంచడం
పెద్దలు రోజూ ఉపయోగించే మందులు, నీళ్ల బాటిళ్లు, కళ్లద్దాలు, ఇతర వస్తువులు ఎప్పుడూ వారి చేతికి అందే దూరంలోనే ఉంచాలి. వస్తువుల కోసం వారు తరచూ ఎక్కువ ఎత్తుకు చేతులు చాచడం లేదా కిందికి వంగడం చేయకూడదు. అవసరమైన సామాగ్రిని టేబుల్ లేదా కంటికి కనిపించే ఎత్తులో అమర్చడం వల్ల అనవసరమైన పరుగులాట తప్పుతుంది.
ప్రమాదకర వస్తువులు తొలగించడం
ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్దలకు పెద్ద గాయాలను తెచ్చిపెడతాయి. నడిచే దారిలో దారాలు, చిన్న కార్పెట్లు, డోర్ మ్యాట్లు అడ్డుగా లేకుండా చూడాలి. కాళ్లు తగిలి కిందపడే అవకాశం ఉన్న అనవసరమైన వస్తువులను ఇళ్ల నుంచి తొలగించాలి. ఎముకలు ధృడంగా ఉండేందుకు ప్రొటీన్లు, క్యాల్షియం ఉన్న ఆహారాన్ని అందిస్తూనే, ఇంట్లోని వాతావరణం వారి భద్రతకు అనుకూలంగా ఉండేలా చూసుకోవడం కుటుంబ సభ్యుల బాధ్యత.




