Retirement: ముందుగానే రిటైర్ అవుదాం.. 70 శాతం మంది భారతీయుల కోరిక ఇదే
Retirement: పదవీ విరమణ విషయంలో భారతీయుల ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఆర్థిక అవసరాలు తీరితే 58-60 ఏళ్లలో కాకుండా అంతకంటే ముందే ఉద్యోగ జీవితానికి ముగింపు పలకాలని చాలామంది కోరుకుంటున్నారు.
Retirement: ముందుగానే రిటైర్ అవుదాం.. 70 శాతం మంది భారతీయుల కోరిక ఇదే
Retirement: 50 ఏళ్లలోపే ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనే ఆకాంక్ష కూడా పెరుగుతోంది. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన ఇండియా రిటైర్‌మెంట్ ఇండెక్స్ స్టడీ (ఐరిస్ 6.0)లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ముందుగానే రిటైర్మెంట్ కావాలని 70 శాతం మంది కోరిక
పట్టణ ప్రాంతాల్లోని భారతీయుల్లో సుమారు 70 శాతం మంది ఆర్థిక అవసరాలు పూర్తిగా తీరితే సంప్రదాయ పదవీ విరమణ వయసు కంటే ముందే ఉద్యోగం మానేయాలని కోరుకుంటున్నారు. వీరిలో సగం మంది 50 ఏళ్లలోపే ఆర్థిక స్వేచ్ఛను సాధించి రిటైర్ కావాలని భావిస్తున్నారు. దీనినే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఎర్లీ (FIRE)గా పిలుస్తారు. అంటే ఉద్యోగ ఆదాయంపై ఆధారపడకుండా, పొదుపులు, పెట్టుబడులతో జీవన ఖర్చులు భరించే స్థాయికి చేరుకోవడం.
రిటైర్మెంట్ నిధిపై అవగాహన ఉన్నా.. ఆందోళనలు
పదవీ విరమణ తర్వాత ప్రస్తుత జీవనశైలిని కొనసాగించడానికి ఎంత డబ్బు అవసరమో తమకు తెలుసని 61 శాతం మంది తెలిపారు. అయితే తమ రిటైర్మెంట్ నిధి జీవితాంతం సరిపోతుందని కేవలం 11 శాతం మంది మాత్రమే నమ్ముతున్నారు. మరోవైపు, తమ పొదుపులు కనీసం ఐదేళ్లు కూడా సరిపోవని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో పదవీ విరమణ కోసం తగినంత నిధిని సమకూర్చుకోవడంపై పట్టణ ప్రజల్లో ఆందోళన ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
తొలి జీతం నుంచే పొదుపు.. 31 ఏళ్లను కీలకంగా భావిస్తున్న ప్రజలు
ప్రతి ఇద్దరిలో ఒకరు తమ మొదటి జీతం నుంచే రిటైర్మెంట్ కోసం పొదుపు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ ప్రణాళికకు అనువైన సగటు వయసు 31 ఏళ్లుగా సర్వేలో తేలింది. తరాలవారీగా చూస్తే జెన్‌జీలు 29 ఏళ్లు, మిలీనియల్స్ 31 ఏళ్లు, జెన్ ఎక్స్+ 34 ఏళ్లను పొదుపు ప్రారంభించడానికి సరైన వయసుగా పేర్కొన్నారు.
ఇప్పటికే రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు ప్రారంభించినట్లు జెన్‌జీల్లో 62 శాతం, మిలీనియల్స్‌లో 70 శాతం, జెన్ ఎక్స్+లో 75 శాతం మంది వెల్లడించారు.
రిటైర్మెంట్ తర్వాతా ఆదాయం, ఆరోగ్య భద్రతపై దృష్టి
రిటైర్మెంట్ అనేది ఇప్పటికీ చాలామందికి ఆర్థిక సవాలుగానే ఉందని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ సుమిత్ మదన్ తెలిపారు. జెన్ ఎక్స్+ తరానికి చెందినవారిలో 82 శాతం మంది స్థిరమైన ఆదాయం కోసం పదవీ విరమణ తర్వాత కూడా పని చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇక సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 75 శాతం మంది రిటైర్మెంట్ తర్వాత కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ఆశిస్తుండగా, 52 శాతం మంది ఆరోగ్య బీమా తీసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా ముందస్తు పదవీ విరమణపై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, తగినంత పొదుపు, స్థిరమైన ఆదాయం, ఆరోగ్య రక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం సూచిస్తోంది.




