వేలికి ఉంగరం ఇరుక్కుందా? ఈ సింపుల్ టిప్స్‌తో తీయండి
వేలికి ఉంగరం ఇరుక్కుపోతే బలవంతంగా లాగొద్దు. చల్లటి నీరు, సబ్బు, నూనెతో సులభంగా తొలగించే చిట్కాలు ఇవే.
Ring Removal Tips
కొన్నిసార్లు బరువు పెరగడం, వేళ్లలో వాపు రావడం లేదా బిగుతైన ఉంగరం ధరించడం వల్ల రింగ్ వేలికి ఇరుక్కుపోతుంది. అలాంటి సమయంలో దాన్ని బలవంతంగా లాగడం వల్ల చర్మం దెబ్బతినడంతో పాటు నొప్పి, వాపు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఉంగరం ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోతే కొందరు చివరికి దాన్ని కట్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే ముందుగా కొన్ని సులభమైన పద్ధతులను ప్రయత్నించవచ్చు.
చల్లటి నీటితో వాపు తగ్గించండి
వేలు బాగా వాచినట్లయితే ముందుగా ఒక గిన్నెలో చల్లటి నీటితో పాటు కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవాలి. వాచిన వేలిని అందులో కొన్ని నిమిషాల పాటు ఉంచాలి.
చల్లదనం వల్ల వాపు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అనంతరం ఉంగరాన్ని నెమ్మదిగా తిప్పుతూ బయటకు తీసేందుకు ప్రయత్నించవచ్చు.
సబ్బు లేదా షాంపూతో ప్రయత్నించండి
వేలు, ఉంగరం మధ్య రాపిడిని తగ్గించడానికి సబ్బు లేదా షాంపూ ఉపయోగించవచ్చు. వేలికి, ఉంగరానికి కొద్దిగా సబ్బు లేదా షాంపూ రాసి నీటితో నురుగు వచ్చేలా చేయాలి.
ఆ తర్వాత ఉంగరాన్ని బలంగా లాగకుండా నెమ్మదిగా తిప్పుతూ బయటకు తీసేందుకు ప్రయత్నించాలి. రాపిడి తగ్గడంతో ఉంగరం జారిపోయే అవకాశం ఉంటుంది.
పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరి నూనె
చర్మం పొడిగా ఉండటం వల్ల ఉంగరం ఇరుక్కుపోయినట్లయితే వేలికి కొద్దిగా పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరి నూనె రాయవచ్చు. అనంతరం ఉంగరాన్ని ముందుకు, వెనక్కి మెల్లగా తిప్పుతూ తొలగించడానికి ప్రయత్నించాలి.
లూబ్రికేషన్ వల్ల చర్మం, ఉంగరం మధ్య రాపిడి తగ్గుతుంది.
చేతిని పైకి ఎత్తి ఉంచండి
వేలు వాపుతో ఉంగరం ఇరుక్కుపోయినట్లయితే చేతిని కొంతసేపు గుండె స్థాయి కంటే పైకి ఎత్తి ఉంచడం ఉపయోగపడవచ్చు. సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు చేతిని పైకి ఉంచిన తర్వాత వాపు కొంత తగ్గితే ఉంగరాన్ని నెమ్మదిగా తొలగించేందుకు ప్రయత్నించవచ్చు.
దారం లేదా డెంటల్ ఫ్లాస్ పద్ధతి
కొన్ని సందర్భాల్లో డెంటల్ ఫ్లాస్ లేదా పలుచని బలమైన దారాన్ని ఉపయోగించే పద్ధతి కూడా ఉంటుంది. అయితే ఈ విధానాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. దారం ఎక్కువగా బిగించడం వల్ల రక్తప్రసరణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున అనుభవం లేకుండా బలవంతంగా ప్రయత్నించడం మంచిది కాదు.
నొప్పి, రంగు మార్పు ఉంటే ఆలస్యం చేయొద్దు
ఈ పద్ధతులు ప్రయత్నించినా ఉంగరం బయటకు రాకపోతే పదేపదే బలవంతంగా లాగకూడదు. ముఖ్యంగా తీవ్రమైన నొప్పి, వేలు నీలం లేదా నల్లగా మారడం, తీవ్రమైన వాపు, మొద్దుబారడం లేదా రక్తప్రసరణ తగ్గినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు లేదా నిపుణుల సహాయంతో ఉంగరాన్ని సురక్షితంగా తొలగించుకోవడం మంచిది.




