RO Water: ఫిల్టర్ వాటర్ తాగితే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందా.? నిపుణులు ఏం చెబుతున్నారు
RO Water: ప్రస్తుతం చాలా ఇళ్లలో తాగునీటి కోసం RO (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్యూరిఫైయర్లను ఉపయోగిస్తున్నారు.
RO Water: ఫిల్టర్ వాటర్ తాగితే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందా.? నిపుణులు ఏం చెబుతున్నారు
RO Water: ప్రస్తుతం చాలా ఇళ్లలో తాగునీటి కోసం RO (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్యూరిఫైయర్లను ఉపయోగిస్తున్నారు. నీటిలో ఉండే మలినాలు, హానికర పదార్థాలను తొలగించి సురక్షితమైన తాగునీటిని అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే RO నీటి గురించి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో అనేక రకాల ప్రచారాలు జరుగుతుంటాయి. వీటిలో నిజం ఎంతంటే..
RO నీటి గురించి ఉన్న ప్రధాన అపోహలు.. వాటి వెనుక నిజం
RO నీరు తాగితే శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు పూర్తిగా పోతాయని చాలామంది భావిస్తారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం RO ప్రక్రియలో నీటిలోని కొన్ని మినరల్స్ పరిమాణం తగ్గే అవకాశం ఉన్నా, శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ప్రధానంగా ఆహారం ద్వారానే అందుతాయి. కాబట్టి కేవలం RO నీరు తాగడం వల్ల శరీరంలో అన్ని ఖనిజాల లోపం వస్తుందనడం సరైన అభిప్రాయం కాదు.
ప్రతి ఇంటికీ RO ప్యూరిఫైయర్ అవసరమా?
చాలామంది ప్రతి ఇంటిలో తప్పనిసరిగా RO ప్యూరిఫైయర్ ఉండాలని భావిస్తుంటారు. కానీ WHO సూచనల ప్రకారం ఇది నిజం కాదు. మీ ప్రాంతంలో లభించే నీటి నాణ్యత, అందులో ఉన్న మలినాలు, TDS స్థాయిలను బట్టి మాత్రమే RO అవసరమా కాదా అనేది నిర్ణయించాలి. నీటి నాణ్యత ఇప్పటికే బాగుంటే ప్రతి ఇంటిలో RO పెట్టాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ముందుగా నీటిని పరీక్షించి, దాని నాణ్యతకు అనుగుణంగా సరైన వాటర్ ప్యూరిఫైయర్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది.
RO నీటిని ఎలా నిల్వ చేయాలి? గట్ హెల్త్‌పై ప్రభావం పడుతుందా.?
RO ద్వారా శుద్ధి చేసిన నీటిని ఎలా పడితే అలా నిల్వ చేయవచ్చని కొందరు అనుకుంటారు. అయితే అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, శుద్ధి చేసిన నీటిని కూడా శుభ్రమైన, మూత ఉన్న పాత్రలోనే నిల్వ చేయాలి. లేదంటే మళ్లీ సూక్ష్మక్రిములు చేరి నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది.
అలాగే RO నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ (గట్) బలహీనపడుతుందనే ప్రచారం కూడా ఉంది. కానీ WHO మార్గదర్శకాల ప్రకారం దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. గట్ ఆరోగ్యం అనేది ఆహారం, ఫైబర్, జీవనశైలి, ఇన్ఫెక్షన్లు, మందుల వినియోగం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి RO నీరే గట్‌ను బలహీనపరుస్తుందని చెప్పడానికి ఇప్పటివరకు అధికారిక ఆధారాలు లేవు.
ఎప్పుడు RO ప్యూరిఫైయర్ అవసరం?
ప్రతి ఇంటికీ RO ప్యూరిఫైయర్ అవసరం ఉండదు. అయితే నీటిలో TDS స్థాయిలు అధికంగా ఉండటం, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, సీసం వంటి హానికర పదార్థాలు ఎక్కువగా ఉండటం వంటి పరిస్థితుల్లో RO ప్యూరిఫైయర్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ ప్రాంతంలోని తాగునీరు ఇప్పటికే సురక్షితంగా ఉంటే RO తప్పనిసరి కాదు.
RO ప్యూరిఫైయర్ ఉపయోగించే వారు దానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ఫిల్టర్లను సమయానికి మార్చాలి. శుద్ధి చేసిన నీటిని ఎప్పుడూ శుభ్రమైన, మూత ఉన్న పాత్రలోనే నిల్వ చేయాలి. అలాగే శరీరానికి అవసరమైన ఖనిజాల కోసం సమతుల్యమైన, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రాంతంలోని నీటి నాణ్యతపై సందేహం ఉంటే లేదా ఏ ప్యూరిఫైయర్ సరైనదో తెలియకపోతే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
RO నీటి విషయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం
RO నీటి గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ప్రతి సమాచారం నిజం కాకపోవచ్చు. కాబట్టి అపోహలను నమ్మే ముందు శాస్త్రీయ ఆధారాలు, WHO, CDC వంటి విశ్వసనీయ సంస్థల సూచనలను పరిశీలించడం అవసరం. నీటి నాణ్యతను పరీక్షించి, అవసరాన్ని బట్టి సరైన ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవడం ద్వారా మాత్రమే సురక్షితమైన తాగునీటిని పొందవచ్చు.




