Pregnancy Care: గర్భిణులకు ఇన్ఫెక్షన్ల ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు
Pregnancy Care: రోగనిరోధక శక్తి తగ్గిన సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పరిశుభ్రత, పోషకాహారం, తగినంత నీరు, ఫ్లూ టీకా, దోమల నివారణ, మంచి నిద్ర చాలా ముఖ్యం.
Pregnancy Care: నవంబర్ నెలలో వాతావరణం వేగంగా మారుతోంది. ఉదయం, సాయంత్రం చలి పెరుగుతుంటే.. పగటిపూట ఎండ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి కొంత తగ్గుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే ప్రమాదం ఉంది. పండుగల సందడి, ప్రయాణాలు, ఇంటి పనుల మధ్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
1. గర్భిణులకు ఇన్ఫెక్షన్లతో ఎక్కువ ప్రమాదం ఎందుకు?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ మీరా పాఠక్ తెలిపిన వివరాల ప్రకారం.. గర్భధారణ సమయంలో మహిళల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉంటుంది. సాధారణంగా వచ్చే జలుబు, ఫ్లూ కూడా కొందరిలో తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇన్ఫెక్షన్ ముదిరితే న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు రావచ్చు. అందుకే వాతావరణం మారుతున్న సమయంలో చిన్నపాటి అనారోగ్య లక్షణాలను కూడా తేలిగ్గా తీసుకోకూడదు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.
2. ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గర్భిణులు వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. భోజనం చేసే ముందు, ఆహారం తయారు చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అవసరమైనప్పుడు శానిటైజర్ వాడాలి. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పండుగల సమయంలో బంధువులు, స్నేహితులతో కలిసినప్పుడు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
3. ఆహారంలో ఈ పదార్థాలు ఉండాలి
రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి. రోజంతా తగినంత నీరు తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో ఉసిరి, నిమ్మకాయ, నారింజ వంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను చేర్చుకోవచ్చు. ఆకుకూరలు, ఇతర కూరగాయలు, నట్స్, గింజలు కూడా తీసుకోవాలి. పసుపు కలిపిన పాలు తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భధారణ సమయంలో ఏదైనా ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
4. ఫ్లూ టీకాతో పాటు దోమల నుంచి రక్షణ
ఫ్లూ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో గర్భిణులు ఇన్ఫ్లుయెంజా టీకా గురించి వైద్యులను సంప్రదించాలి. ఈ టీకా సాధారణంగా ఏడాదికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది టీకా తీసుకున్నా.. ఈ ఏడాది మళ్లీ అవసరమా అనే విషయాన్ని డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి. గర్భధారణ సమయంలో ఏ త్రైమాసికంలో టీకా తీసుకోవచ్చనే విషయాన్ని కూడా వైద్యులే నిర్ణయించాలి. మరోవైపు దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దోమతెర వాడాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల నివారణ క్రీములు వాడాలనుకుంటే ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
5. నిద్ర తగ్గొద్దు
గర్భిణులకు తగినంత విశ్రాంతి కూడా చాలా అవసరం. పండుగల పనులు, ఇంటి బాధ్యతలతో అలసిపోయేలా చేసుకోకూడదు. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోవడంతో పాటు, పగటిపూట కూడా అవసరమైనంత విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి లేదా బిగుతుగా అనిపించడం, చర్మంపై దద్దుర్లు, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.




