Health Tips: వేరొకరి ఇయర్ బడ్స్ వాడుతున్నారా.? ఇది తెలిస్తే ఇంకోసారి ఆ జోలికి వెళ్లరు..
Health Tips: మీ స్నేహితులు లేదా ఇతరుల బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్, ఇయర్ బడ్స్‌ను తరచుగా వాడుతుంటారా? అయితే మీరు ప్రమాదకరమైన చెవి ఇన్ఫెక్షన్లను కొనితెచ్చుకుంటున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Health Tips: వేరొకరి ఇయర్ బడ్స్ వాడుతున్నారా.? ఇది తెలిస్తే ఇంకోసారి ఆ జోలికి వెళ్లరు..
Health Tips: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరి వద్ద బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ కచ్చితంగా ఉంటున్నాయి. ప్రయాణాల్లో ఉన్నప్పుడైనా, ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడైనా పాటలు వినడానికి లేదా ఫోన్ మాట్లాడటానికి ఇవి ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగపడతాయి. అయితే, చాలామంది తమ ఇయర్ బడ్స్ అందుబాటులో లేనప్పుడు లేదా స్నేహితులు పంపిన ఏదైనా ఆడియో వినడానికి వారి ఇయర్ బడ్స్‌ను మార్చుకుని వాడుతుంటారు. ఇలా ఇతరుల బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ వాడటం అనేది అత్యంత ప్రమాదకరమని, ఇది నేరుగా చెవి ఇన్ఫెక్షన్లను కొనితెచ్చుకోవడమేనని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒకరి ఇయర్ బడ్స్‌ను మరొకరు పంచుకోవడం అనేది తీవ్రమైన అపరిశుభ్రమైన అలవాటు. ఇది ఎంత అసహ్యకరమైన అలవాటంటే, వేరొకరు వేసుకుని చెమట పట్టిన సాక్సులను మనం వేసుకోవడం కంటే కూడా ఘోరమైనదని వైద్యులు పోల్చి చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరి చెవి లోపలి భాగంలో కొంత శాతం సహజమైన బ్యాక్టీరియా, వ్యాక్స్, ఫంగస్ ఉంటాయి. ఇవి ఆయా వ్యక్తుల శరీర తత్వానికి అనుగుణంగా ఉంటాయి. అయితే, మనం ఇతరుల ఇయర్ బడ్స్‌ను మన చెవిలో పెట్టుకున్నప్పుడు, వారి చెవిలో ఉండే ఆ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఫంగస్ కణాలు ఆ ఇయర్ బడ్స్ ద్వారా నేరుగా మన చెవిలోకి ప్రవేశిస్తాయి.
ఇలా ఇతరుల బ్యాక్టీరియా మన చెవిలో చేరడం వల్ల చెవి లోపలి భాగంలో తీవ్రమైన అలర్జీలు, ఇన్ఫెక్షన్లు దారితీస్తాయి. దీనివల్ల చెవిలో భరించలేనంత తీవ్రమైన దురద, విపరీతమైన నొప్పి, చెవిలో నుంచి పసుపు రంగు ద్రవాలు కారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. సమస్య మరింత తీవ్రమైతే అది వినికిడి లోపానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు. అందుకే పర్సనల్ హైజీన్లో భాగంగా ఇయర్ బడ్స్ అనేవి కేవలం మీ వ్యక్తిగత అవసరాలకు మాత్రమే పరిమితం కావాలి. 'మీ ఇయర్ బడ్స్‌ను ఎవరికీ ఇవ్వకండి, ఇతరులవి మీరు అస్సలు వాడకండి' అని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వేరొకరిది వాడాల్సి వచ్చినా లేదా మీ ఇయర్ బడ్స్‌ని ఇతరులు వాడినా.. వాటిని తిరిగి ఉపయోగించే ముందు శానిటైజర్ లిక్విడ్ లేదా ఆల్కహాల్ వైప్స్‌తో పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతే వాడటం సురక్షితం.




