‘నృత్యోపాసన’ నాట్య ప్రదర్శన... రవీంద్ర భారతిలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన శృతి వారణాసి!
హైదరాబాద్ రవీంద్ర భారతిలో శృతి వారణాసి ప్రదర్శించిన 'నృత్యోపాసన' కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
‘నృత్యోపాసన’ నాట్య ప్రదర్శన... రవీంద్ర భారతిలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన శృతి వారణాసి!
గత శనివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణం కూచిపూడి నాట్య సౌందర్యంతో పరవశించింది. "నృత్యమాల అకాడమీ ఆఫ్ ఇండియన్ డాన్సెస్ అండ్ సెంటర్ ఫర్ హైయర్ లర్నింగ్" సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్య కళాకారిణి శృతి వారణాసి సమర్పించిన ‘నృత్యోపాసన’ కూచిపూడి నృత్య ప్రదర్శన కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. గురు సుధామాల వద్ద గత 15 ఏళ్లకు పైగా నాట్యంలో శిక్షణ పొందిన శృతి, తన అద్భుత అభినయం, పాదవిన్యాసాలతో వేదికపై లయ విన్యాసం చేశారు.
పూజలతో ప్రారంభమై.. భావయుక్త నాట్యం వరకు:
ప్రత్యక్ష వాద్యబృందం సహకారంతో సాగిన ఈ ప్రదర్శన రేవతి రాగంలోని ‘పుష్పాంజలి’తో ధ్యానపూర్వకంగా ప్రారంభమైంది. అనంతరం ఆటన రాగంలో మహారాజా జయచామరాజేంద్ర వొడయార్ రచించిన ‘గణపతి కీర్తన’తో విఘ్నేశ్వరునికి నివాళులర్పించారు.
కథనాత్మక శబ్దాలు - భావోద్వేగాల మేళవింపు:
ప్రహ్లాద పట్టాభిషేక శబ్దం: కంభోజి రాగంలో సాగిన ఈ శబ్దంలో శృతి ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, ఉగ్ర నరసింహస్వామి పాత్రల భావాలను ఒక్కరే అత్యంత సమర్థవంతంగా పలికించారు.
ఆడెనమ్మా హరూ: ఫరజ్ రాగంలోని కృతి ద్వారా పార్వతీదేవి సమక్షంలో పరమశివుడు చేసిన దివ్య నృత్యాన్ని ప్రేక్షకులకు కళ్లకట్టినట్లు చూపించారు.
నవరసాలు: శివుని తత్వాన్ని వివరిస్తూ శాంతం, శృంగారం, హాస్యం, రౌద్రం, కరుణ తదితర నవరసాలను పురాణ ఘట్టాల ద్వారా ప్రదర్శించారు.
భామకలాపం & కీర్తనలు: భామకలాపంలోని లేఖ ఘట్టంలో కృష్ణుడికి ప్రతీకగా వేణువు నాదాన్ని ఉపయోగిస్తూ ప్రదర్శించిన తీరు వినూత్నంగా నిలిచింది. అలాగే అన్నమాచార్యుల 'కౌసల్యానందన రామ', శ్రీ నారాయణ తీర్థుల 'కృష్ణ లీలా తరంగిణి'లోని 'కలయాత వన భువి' కీర్తనలకు క్లిష్టమైన ఇత్తడి పళ్ళెంపై పాదవిన్యాసం చేసి మెప్పించారు.
దరి చూచుచున్నది: శంకరాభరణ రాగంలో వాసకసజ్జ నాయికగా ప్రియుడి రాక కోసం ఎదురుచూసే శృంగార అభినయాన్ని సున్నితంగా ప్రదర్శించారు.
ప్రత్యేకాకర్షణగా ‘సింహానందిని’:
ఆలయ నృత్య సంప్రదాయంలో అత్యంత క్లిష్టమైన ‘సింహానందిని’ ఈ ప్రదర్శనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గురు ఉమా వైజయంతిమాల నేర్పించిన ఈ ప్రత్యేక నృత్యంలో.. రంగస్థలంపై చల్లిన రంగుల పొడిపై నర్తకి తన లయబద్ధమైన పాదవిన్యాసాలతో దుర్గాదేవి వాహనమైన సింహం చిత్రాన్ని ఆవిష్కరించారు. ఒకే సమయంలో నర్తకిగా, దృశ్య కళాకారిణిగా శృతి కనబరిచిన ప్రతిభకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.




