Health: నిద్ర త‌క్కువైతే బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసా.?

Health: రోజూ సరైన నిద్ర లేకపోతే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకండి. ఎక్కువ కాలం పాటు నిద్ర సరిగా లేకపోవడం వల్ల రక్తపోటు, ఒత్తిడి పెరగడంతో పాటు గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

Mokshith
Published on: 29 Sept 2026 5:13 PM IST
Health
X

Health: నిద్ర త‌క్కువైతే బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసా.?

Health: రోజూ సరైన నిద్ర లేకపోతే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకండి. ఎక్కువ కాలం పాటు నిద్ర సరిగా లేకపోవడం వల్ల రక్తపోటు, ఒత్తిడి పెరగడంతో పాటు గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే శరీరానికి అవసరమైనంత నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.

రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి?

చాలామందిలో.. రాత్రి ఆలస్యంగా మొబైల్‌ చూడటం, పని ఒత్తిడి, చదువు, మారిన జీవనశైలి కారణంగా నిద్ర త‌గ్గిపోతోంది. రోజూ 5 నుంచి 6 గంటలు నిద్రపోయినా పర్వాలేదని భావిస్తున్నారు. కానీ పెద్దలకు సాధారణంగా ప్రతి రాత్రి కనీసం 7 గంటల నిద్ర అవసరం. ఒకటి, రెండు రోజులు తక్కువ నిద్రపోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అయితే ప్రతిరోజూ నిద్ర తగ్గిపోతే దాన్ని అలవాటుగా మార్చుకోకూడదు.

నిద్ర సమయంలో శరీరం విశ్రాంతి తీసుకోవడంతో పాటు అనేక ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. గుండెకు కూడా ఈ సమయంలో విశ్రాంతి లభిస్తుంది. ఎక్కువ కాలం నిద్ర సరిగా లేకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్, రక్తపోటు వంటి సమస్యలకు సంబంధించిన ప్రమాదాలు పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ప్రతి వ్యక్తికి అవసరమైన నిద్ర సమయం కొంత భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి నిద్ర గంటలతో పాటు నిద్ర నాణ్యతను కూడా గమనించాలి.

తక్కువ నిద్రతో బీపీ ఎందుకు పెరగొచ్చు?

మనం నిద్రపోతున్నప్పుడు సాధారణంగా రక్తపోటు కొంత తగ్గుతుంది. దీనివల్ల గుండెకు విశ్రాంతి లభిస్తుంది. అయితే నిద్ర సరిగ్గా లేకపోతే లేదా రాత్రి పదేపదే మెలకువ వస్తుంటే ఈ సహజ ప్రక్రియకు ఆటంకం కలగొచ్చు. దీర్ఘకాలంగా నిద్ర సమస్యలు ఉంటే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదంతో సంబంధం ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

అధిక రక్తపోటు ఎక్కువ కాలం కొనసాగితే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందుకే కొన్ని రోజులుగా నిద్ర సరిగ్గా లేకపోతే దాన్ని కేవలం అలసటగా భావించి వదిలేయకూడదు. ముఖ్యంగా ఇప్పటికే బీపీ సమస్య ఉన్నవారు నిద్ర విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

7-8 గంటలు పడుకున్నా నిద్ర సరిపోకపోవచ్చు

బెడ్‌పై 7 లేదా 8 గంటలు గడిపినంత మాత్రాన నిద్ర పూర్తిగా అయినట్లు కాదు. రాత్రి పదేపదే మెలకువ రావడం, నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవ‌డం, ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటే నిద్ర నాణ్యత సరిగ్గా లేదని అర్థం చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం స్లీప్‌ అప్నియా.

బాగా గురక పెట్టడం, నిద్రలో ఊపిరి ఆగినట్లు అనిపించడం, తరచూ మెలకువ రావడం, ఉదయం లేచిన తర్వాత తలనొప్పి లేదా రోజంతా నిద్రగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే స్లీప్‌ అప్నియా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉన్నట్లు వైద్య సంస్థలు చెబుతున్నాయి. ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

నిద్ర బాగా పట్టాలంటే ఈ అలవాట్లు పాటించండి

రోజూ ఒకే సమయానికి నిద్రపోవడానికి, ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడానికి ప్రయత్నించండి. పగటిపూట కొంత శారీరక శ్రమ చేయడం, ఉదయం లేదా పగటి సమయంలో కొద్దిసేపు సహజమైన వెలుతురులో ఉండటం కూడా నిద్రకు సహాయపడుతుంది. పడుకునే ముందు మొబైల్‌, ల్యాప్‌టాప్‌, టీవీ వంటి స్క్రీన్ల వాడకాన్ని తగ్గించడం మంచిది.

పడుకునే గదిని ప్రశాంతంగా, చీకటిగా, సౌకర్యవంతంగా ఉంచుకోవాలి. రాత్రి ఆలస్యంగా ఎక్కువగా తినడం, కెఫీన్‌ తీసుకోవడం వంటి అలవాట్లను కూడా తగ్గించడం ఉపయోగపడుతుంది. నిద్ర సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నా, తరచూ నిద్ర మధ్యలో మెలకువ వస్తున్నా లేదా పగటిపూట విపరీతంగా నిద్ర వస్తున్నా స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.